news18-telugu
Updated: November 22, 2020, 6:28 PM IST
సీఎం కేసీఆర్, ముంతాజ్ ఖాన్
గ్రేటర్లో ఎన్నికల యుద్ధం తారా స్థాయికి చేరింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇన్నాళ్లు పాతబస్తీలో సైలెంట్‌గా ప్రచారం చేసుకునే ఎంఐఎం కూడా వాయిస్ పెంచింది. బీజేపీ కాదు.. తాము సన్నిహితంగా ఉంటే టీఆర్ఎస్పైనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. తాము తలచుకుంటే రెండు నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్.. కేటీఆర్‌ను చిలుక అంటూ సెటైర్లు వేశారు. మజ్లిస్ పార్టీ ఎంతో మందిని చూసిందని.. ఆయన మొన్నే రాజకీయాల్లోకి వచ్చాడని అన్నారు.
తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్లు.. రాజకీయం మా ఇంటి గుమాస్తాతో సమానమని ముంతాజ్ అహ్మద్ ఖాన్ చెప్పారు. అంతేకాదు తాము తలచుకుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లోనే పడగొడతామని హెచ్చరించారు. ఒకరిని గద్దెపై కూర్చోబెట్టడం తెలుసు.. గద్దె దింపడమూ తెలుసని స్పష్టం చేశారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఎంఐఎంతో పొత్తు ప్రసక్తే లేదని, ఒంటరిగానే 150 సీట్లలో పోటీచేస్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 5చోట్ల ఎంఐఎంను ఓడించామని, ఈసారి 10 చోట్లకుపైగా ఎంఐఎంను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ పదవిని ఎంఐఎంకు ఇవ్వడానికి మాకేమైనా పిచ్చా అని అన్నారు. బల్దియా మీద మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు చాలా కాలంగా మిత్రపక్షంగా ఉంటూ వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను అసెంబ్లీ వేదికగా మజ్లిస్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. సీఎం కేసీఆర్‌పై పలు సందర్భాల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ ఒక్కటేనని.. టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని బీజేపీ చాలాసార్లు ప్రచారం చేసింది. కానీ ఇవాళ టీఆర్ఎస్పై మజ్లిస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
కాగా, నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు గాను 2600 నామినేషన్లు దాఖలయ్యాయి. 21న నామినేషన్లు పరిశీలించారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 22, 2020, 6:19 PM IST