వయనాడ్...! లోక్సభ ఎన్నికల వేళ ఎక్కువగా వినిపిస్తున్న నియోకవర్గం పేరు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీచేస్తుండడంతో దేశవ్యాప్తంగా వయనాడ్ పేరు మార్మోగిపోతోంది. గిరిజనుల ప్రాబల్యమున్న ఈ లోక్సభ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ తొలిసారి బరిలో దిగుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం నింపాలన్న ఉద్దేశంతో అమేథీతో పాటు వయనాడ్లో పోటీచేస్తున్నారు కాంగ్రెస్ అధినేత. ఐతే గిరిజనుల ఎదుర్కొంటున్న సమస్యలే ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి.
వయనాడ్ జిల్లాలో సుమారు 18శాతం గిరిజన జనాభా ఉంది. దశాబ్ధాల కాలంగా పనియాస్, కురుమలు, ఆదియార్, కురిచ్యాస్, కట్టునైక్కన్స్ వంటి ఆదిమ జాతి తెగలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న సుల్తాన్ భాతెరి, మానంతవాదీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్టీలకే రిజర్వ్ చేయబడ్డాయి. అటవీ, కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, రవాణా వంటి మౌలికసదుపాయాలతో పాటు నీరు, తిండి, గూడు వంటి ప్రాథమిక అవసరాలు కూడా వీరికి తీరలేదు. వీటితో పాటు ఏనుగుల బెడద కారణంగా అనునిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నారు వయనాడ్ గిరిజనులు.

మా ఇళ్లు అడవిలో ఉంటాయి. ఏనుగుల దాడులతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో మేం పాల్గొనం. మా ఓటు వేసినా ఉపయోగం ఉండదు.
— స్థానిక గిరిజన మహిళ
వయనాడ్..గిరిజనుల భూమని ఆదివాసీ సంఘాల నేతలు చెబుతున్నారు. కానీ సొంతగడ్డపైనే గ్రహాంతరవాసులుగా బతుకుతున్నామని వారు వాపోతున్నారు. ఇక్కడి ప్రజలకు సరైన ఆహారం కూడా లేదని..పోషకాహార లోపంతో చిన్నపిల్లలు ఇబ్బందులుపడుతున్నారని జితేంద్రనాథ్ అనే డాక్టర్ న్యూస్18తో చెప్పారు. మాంసం, పండ్లు వయనాడ్ గిరిజనుల సంప్రదాయ ఆహారమని..కానీ ప్రభుత్వం పలు పథకాల ద్వారా మిల్క్ పౌడర్, బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఆ ఆహారపదార్థాలను తినలేక గిరిజనులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపారు.

వయనాడ్ ప్రజల ఓట్లను కోరే రాజకీయ నేతలు ముందుగా ఇక్కడి ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారం చూపాలి. కనీస అవసరాలను తీర్చేలా కృషిచేయాలి. అంతేతప్ప గిరిజనులను ఓట్ బ్యాంకుగా చూడకండి.
— జితేంద్రనాథ్
రాహుల్ గాంధీ ఐనా, ఇంకెవరైనా..ముందు ఇక్కడి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపాలంటున్నారు వయనాడ్ గిరిజనులు. కనీస అవసరాలను తీర్చడంతో పాటు ఏనుగుల దాడుల నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. అలాంటి వారికే తమ ఓటువేస్తామని స్పష్టంచేస్తున్నారు. కాగా, వయనాడ్లో కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ పోటీచేస్తుండగా, LDF తరపున సీపీఐ అభ్యర్థి పీపీ సునీర్ బరిలో ఉన్నారు. ఇక NDA తరపున BDJS అభ్యర్థి తుశార్ వెల్లపల్లి పోటీలో ఉన్నారు.