ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాజకీయ దుమారం తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లూ మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నేతలు అమరావతిపై మాటల యుద్ధానికి దిగితే.., ఈసారి పోరు ఏకంగా సీఎం వర్సెస్ మాజీ సీఎంగా మారింది. అమరావతి పోరాటానికి ఏడాది పూర్తైన రోజునే ఇద్దరు అగ్రనేతలు నోటికి పనిచెప్పారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఒకరు చెడిపోయిన బుర్ర.. అని విమర్శిస్తే..మరొకరు వన్ టైమ్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నోటికి పనిచెప్పారు. అమరావతి విషయంలో సీఎం జగన్.. టీడీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబును తీవ్రస్థాయిలో విమర్శిస్తే.. రాజధాని అంశంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు ప్రశ్నించారు. ఓవైపు రాజధాని జనభేరి.. మరోవైపి బీసీల సంక్రాంతి వేదికలుగా అగ్రనేతలు విమర్శించుకోవడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి.
చెడిపోయిన బుర్ర..
శుక్రవారం విజయవాడలో జరిగిన బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. బీసీల సంక్రాంతి పేరుతో నిర్వహించిన సభకు హాజరైన ఆయన రాజధాని అంశంపై నోరువిప్పారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ “దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో పనిచేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చని” ఎద్దేవా చేశారు. తాను స్వంతంగా కొనుగోలు చేసిన భూముల వద్దే రాజధానిని నిర్ణయించారన్నారు. అంతేకాదు తాను, తన బినామీలను బాగు చేసేందుకు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని ఆరోపించారు. అమరావతి పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
వన్ టైమ్ సీఎం..
జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్ వన్ టైమ్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఆంధ్రుల కలల రాజధానిని మొగ్గలోనే తుంచేస్తున్నారని విమర్శించారు. సీఎంకు దమ్ముంటే అమరావతిపై రెఫరండం పెట్టాలని డిమాండ్ చేశారు. రెఫరెండంలో అమరావతి ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో రాజధాని అమరావతికి మద్దతుగా మాట్లాడి అధికారం తలకెక్కిన తర్వాత మూడు రాజధానుల పేరుతో నాటకాలాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తనపై ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.., అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందని ప్రశ్నించారు. అమరావతి సభకు వెళ్లడానికి ముందు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు.. రాజధానిని రక్షించాలని మొక్కుకున్నట్లు తెలిపారు.
మరోవైపు ఏపీ బీజేపీ కూడా రాజధాని అంశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేస్తోంది. ఏం జరిగినా సరే రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. చంద్రబాబు అమరావతిని నిర్మించకపోవడం వల్లే అమరావతి ఉద్యమం వచ్చిందని ఆయన ఆరోపించారు.
Published by:Purna Chandra
First published:December 17, 2020, 15:47 IST