ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు (AP Politics) మరోసారి వేడెక్కాయి. ఈసారి మాటల తూటాలు వ్యక్తిగత దూషణల నుంచి హత్యా రాజకీయాలవైపు మలుపు తిరిగాయి. కమ్మ వనసమారాధనలో మధిర టీఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు కామెంట్స్ తర్వాత ఏపీలో రాజకీయ హత్యలపై వైసీపీ, టీడీపీ మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. సీఎం జగన్ కు టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన కామెంట్స్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అంతేకాదు గతంలో జరిగిన పలు సంఘనలను వైసీపీకి ఆపాదిస్తూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. సానుభూతి ఓట్ల దక్కించుకోవాలన్న మనస్తత్వం వైసీపీకి ఉందని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబమని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ ను హత్య చేయడానికి ఓ పథకం రచిస్తున్నారని.. ఓ కులానికి చెందిన వారు చందాలు వేసుకుంటున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పడంతో చాలా విడ్డూరంగా ఉందననారు. వైసీపీలోని ఓ వర్గం జగన్ పై కుట్ర చేస్తోందని.. జగన్ జైలుకెళ్లగానే సీఎం కుర్చీ ఎక్కడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. వైసీపీలో మంత్రి పదవులు రానివాళ్లు, జగన్ తో సమానస్థాయి కలిగిన నేతలు జగన్ ను అంతం చేసేందుకు కుట్రపన్నుతున్నారేమోనన్న అనుమానం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోడికత్తు కేసుపై నానా హడావిడి చేసిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తోందని ప్రశ్నించారు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసే కుట్రను వైసీపీ నాయకులే చేశారన్నారు. సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలోనూ అరెస్ట్ చేయవద్దంటూ కోర్టులో స్టే తెచ్చుకున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.
నిన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, నేడు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారూ జగన్ రెడ్డి ప్రాణాలకు హానితలపెట్టొచ్చని తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం ..మరో కోడికత్తి డ్రామా, బాత్రూమ్ బాబాయ్ గొడ్డలివేటు రిహార్సల్లాగా అనిపిస్తోంది. ఓవైపు అప్పులకుప్ప, (1/3)
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) December 13, 2021
మరోవైపు దోపుదుర్తి, నారాయణ స్వామి కామెంట్స్ పై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. “నిన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, నేడు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారూ జగన్ రెడ్డి ప్రాణాలకు హానితలపెట్టొచ్చని తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం ..మరో కోడికత్తి డ్రామా, బాత్రూమ్ బాబాయ్ గొడ్డలివేటు రిహార్సల్లాగా అనిపిస్తోంది. ఓవైపు అప్పులకుప్ప, మరోవైపు తీవ్రమైన ప్రజావ్యతిరేకతతో..మళ్లీ కోడికత్తికి సానబెడుతూ, గొడ్డలికి దారుబెడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అబ్బాయ్ గారూ.. ఈ సారి ఏ బాబాయ్‌కి గురిపెట్టారో! తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల దుర్మార్గుడికి దూరంగా వుంటున్నా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చెబుతోంది. బురద రాజకీయం మాని హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి.” అని అయ్యన్న ట్వీట్ చేశారు.
మొత్తానికి పక్కరాష్ట్రంలో రేగిన చిచ్చు.. ఏపీ రాజకీయాలను ఓ ఊపుఊపేస్తున్నాయి. రెండు పార్టీలు ఎక్కడా తగ్గకపోవడంతో ఈ వ్యవహారం ఎక్కడివరకు వెళ్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, TDP, Ysrcp