ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ – భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపిస్తుంటే.. ఆలయాల కూల్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న మీరేం చేశారని వైసీపీ కౌంటర్లు వేస్తోంది. రెండు పార్టీలు ఆలయాలకు సంబంధించిన లెక్కలు బయటపెట్టి మాటల యుద్ధానికి తెరలేపాయి. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని విమర్శలు చేస్తూ వస్తోన్న బీజేపీ నేతలు.. మరో అడుగు ముందుకేసి నేరుగా ధర్నాకే దిగారు. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో కూల్చిన ఆలయాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి చర్చిలపై ఉన్న ప్రేమ హిందూ ఆలయాలపై లేదని సోము వీర్రాజు విమర్శించారు.
హిందూ ధర్మం పట్టదా..?
సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి హిందూ సంప్రదాయాలపై నమ్మకం, గౌరవం లేవని సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దర్గాల నిర్మాణానికి రూ.5 కోట్లు, చర్చిల నిర్మాణానికి రూ.24 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందూ ఆలయాలను పట్టించుకోవడం లేదన్నారు. ఇక దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పైనా సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. ఆనాడు ఆలయాలు నిర్మించాలంటూ బీజేపీ తరపున ధర్నాలు చేసిన ఆయన.. ఇప్పుడు దేవాదాయ శాఖా మంత్రిగా ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అతంర్వేదిలో రథం దగ్ధం, దుర్గగుడిలో సింహాల ప్రతిమల చోరీ కేసులు ఏమయ్యాయని నిలదీశారు. దేవాలయల భూముల్లో ఇళ్లు కడతారు గానీ.. ఆలయాలను పట్టించుకోవడం లేదన్నారు. ఆలయాలపై చూపుతున్న నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ వెల్లంపల్లి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. సీఎం జగన్ కు దమ్ముంటే చర్చిల నుంచి డబ్బు తీసుకోని ఖర్చు చేయాలని సవాల్ విసిరారు.
అప్పుడు నిద్రపోయారా..?
ఇక సోము వీర్రాజు కామెంట్స్ పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆలయాలు కూల్చినప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీ నేత మాణిక్యాలరావు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఆలయాలు నిర్మిస్తున్నామని తెలిసే సోము వీర్రాజు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఆలయాలు నిర్మిస్తే సీఎం జగన్ కు క్రెడిట్ దక్కుతుందనే వేషాలేస్తున్నారని ధ్వజమెత్తారు. కోట్ల విలువైన దుర్గగుడి భూముల్ని సిద్దార్థ కాలేజీకి కారు చౌకగా ఇస్తే ఆనాడు బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. టీడీపీ హాయాంలో మంత్రాలయం భూములు, సదావర్తి భూములు అమ్ముకోవచ్చని బీజేపీ మంత్రే సంతకం చేశారన్నారు. ప్రభుత్వం వందల ఎకరాల దేవాలయాల భూములను అన్యాక్రాంతం చేస్తే ఎందుకు మాట్లాడలేదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap bjp, Ap cm ys jagan mohan reddy, Hindu Temples, Vellampalli srinivas, Ysrcp