సెలక్ట్ కమిటీ అంశంలో మలుపు... తెరపైకి మరో కొత్త వివాదం...

ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు బిల్లులను సెలక్ట్ కమిటీలకు పంపాలన్న నిర్ణయం చివరికి శాసన, కార్యనిర్వాహక వ్యవస్ధల మధ్య పోరుగా మారిపోయింది.

news18-telugu
Updated: February 19, 2020, 7:51 PM IST
సెలక్ట్ కమిటీ అంశంలో మలుపు... తెరపైకి మరో కొత్త వివాదం...
ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్
  • Share this:
ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు బిల్లులను సెలక్ట్ కమిటీలకు పంపాలన్న నిర్ణయం చివరికి శాసన, కార్యనిర్వాహక వ్యవస్ధల మధ్య పోరుగా మారిపోయింది. సెలక్ట్ కమటీలకు బిల్లులు పంపాలన్న తన నిర్ణయాన్ని అమలు చేయని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను సస్పెండ్ చేయాలని నిన్న గవర్నర్ హరిచందన్ కు ఛైర్మన్ షరీఫ్ ఫిర్యాదు చేయగా ఇవాళ అలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సీఎస్ నీలం సాహ్నిని సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది.

ఏపీలో శాసనమండలి భవిష్యత్తుపై ఓవైపు నీలినీడలు కమ్ముకుంటున్న వేళ.. మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు బిల్లులను సెలక్ట్ కమిటీలకు పంపాలన్న మండలి ఛైర్మన్ నిర్ణయం అమలుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సెలక్ట్ కమిటీకి బిల్లులు పంపాలన్న తన ఆదేశాలను అమలు చేయని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు వైఖరిపై ఆగ్రహంగా ఉన్న ఛైర్మన్ షరీఫ్ నిన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. మండలి ఛైర్మన్ గా తాను ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంతో పాటు సెలక్ట్ కమిటీకి పంపాల్సిన రెండు బిల్లులను రెండు సార్లు తనకు వెనక్కి పంపాలని షరీఫ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన కార్యదర్శి వైఖరి సక్రమంగా లేదని, ఆయన్ను వెంటనే ఉద్యోగం నుంచి తప్పించాలని షరీఫ్ గవర్నర్ ను కోరారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం పతాక స్ధాయికి చేరుకున్నట్లయింది.

అదే సమయంలో అసెంబ్లీ కార్యదర్శికి అండగా నిలవాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మండలి ఛైర్మన్ ఆదేశాలను అమలు చేయలేదనే సాకుతో అసెంబ్లీ కార్యదర్శిని విధుల నుంచి తప్పించడం కుదరదని, అలా చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి ఇవాళ సీఎస్ ను కలిసిన తర్వాత హెచ్చరించారు. దీంతో మండలి బిల్లుల పోరు కాస్తా కార్యనిర్వాహక, శాసన వ్యవస్ధల మధ్య పోరుగా మారిపోయింది. ఉద్యోగ సంఘాల తాజా హెచ్చరికల నేపథ్యంలో గవర్నర్ ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శిపై చర్యలు తీసుకునే అధికారం కలిగిన సీఎస్ నీలం సాహ్ని ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు