news18-telugu
Updated: April 16, 2019, 12:58 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఈవీఎంలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. ఏపీలో పోలింగ్ తర్వాత ఈవీఎంల పనితీరుపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈవీఎం యంత్రాలను సులభంగా ట్యాంపరింగ్ చేయవచ్చని జాతీయస్థాయిలో పోరాటం చేస్తున్నారు. విపక్షాలతో కలిసి ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఎన్నికల్లో పారదర్శకత రావాలంటే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని..లేదంటే బ్యాలెట్ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈవీఎంలపై ఛత్తీస్గఢ్లో మరో రచ్చ మొదలైంది. ఈవీఎం బటన్స్ షాక్ కొడుతున్నాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి బాంబు పేల్చారు. ఒకేసారి బటన్ నొక్కాలని..రెండో మీట నొక్కితే షాక్ కొడుతుందని ఓటర్లను హెచ్చరించారు.

ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈవీఎంలో ఒకేసారి మీట నొక్కాలి. రెండో బటన్ నొక్కితే ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది.
— కవాసి లఖ్మా, మంత్రి
కాంకేర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు కవాసి లఖ్మా. ఐతే ఆయన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. అర్ధం లేని ఆరోపణలతో ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈవీఎంలపై అసత్య ప్రచారం చేసిన లఖ్మాపై చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేశారు.

కవాసి లఖ్మా
61 ఏళ్ల కవాసి లఖ్మా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సుక్మా జిల్లా కొంటా నుంచి ఆయన ప్రతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం సీఎం భూపేశ్ బాఘేల్ కేబినెట్లో ఎక్సైజ్, వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా పనిచేస్తున్నారు. ఒక మంత్రి స్థాయిలో ఉండి ఈవీఎంల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published by:
Shiva Kumar Addula
First published:
April 16, 2019, 12:56 PM IST