Home /News /politics /

VK SASIKALA WILL TOOK KEY POLITICAL DECISIONS IN THIS WEEK SSR

బెంగళూరు ఫాం హౌస్ నుంచే రాజకీయం మొదలుపెట్టిన చిన్నమ్మ.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే...

శశికళ (ఫైల్ ఫోటో)

శశికళ (ఫైల్ ఫోటో)

తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలిత ఆప్తురాలు జైలు నుంచి విడుదల కావడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, అన్నాడీఎంకే కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడంతో శశికళ తీసుకోబోయే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ ముఖ్య పాత్ర పోషిస్తారని...

ఇంకా చదవండి ...
  బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలిత ఆప్తురాలు జైలు నుంచి విడుదల కావడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, అన్నాడీఎంకే కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడంతో శశికళ తీసుకోబోయే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ ముఖ్య పాత్ర పోషిస్తారని, ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆమె అనుచరులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అయితే.. శశికళ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంతవరకూ పోటీకి అర్హురాలనే విషయం సందేహమే. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆర్థిక నేరంపై జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో, అవినీతికి పాల్పడ్డారన్న కారణంగా నాలుగేళ్లు జైలు జీవితం గడిపిన శశికళ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ నేపథ్యంలో ఆమె పోటీపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

  ఆమె అనుచరులు మాత్రం చిన్నమ్మ ఈ ఎన్నికల్లో పోటీ చేసి తీరతారని చెబుతున్నారు. అందుకు.. జైలు శిక్ష అనుభవించి పోటీ చేసి, ఆ సమయంలో ముఖ్యమంత్రిగా గెలిచిన సిక్కిం రాష్ట్ర మంత్రి ప్రేమ్‌సింగ్ దమాంగ్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. అవినీతికి పాల్పడిన కేసులో ప్రేమ్ సింగ్ జైలు శిక్ష అనుభవించి 2018లో విడుదలయ్యారు. తనపై ఆరేళ్ల పాటు నిషేధాన్ని ఎత్తివేయాలని ఈసీని ఆయన కోరడం, ఈసీ అందుకు అంగీకరించడంతో ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. 1951 సెక్షన్ 11 ప్రకారం సడలింపునకు అవకాశం ఉందనేది శశికళ అనుచరుల వాదన.

  ఇక.. శశికళ రీఎంట్రీకి సంబంధించి యాక్షన్ ప్లాన్ బెంగళూరులోని ఓ ఫాం హౌస్ వేదికగా సిద్ధమవుతోంది. టీటీవీ దినకరన్ సోమవారం నాడు బెంగళూరులోని ఓ ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న శశికళతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. ఈ వారం రోజుల్లో శశికళ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే రెండాకుల గుర్తును శశికళ ఇప్పటికీ తన గుర్తుగానే భావిస్తున్నారు. ఆమె బెంగళూరు ఆసుపత్రి నుంచి కారులో బయల్దేరిన సమయంలో కూడా రెండాకుల జెండా ఉన్న కారులోనే శశికళ ఫాం హౌస్‌కు చేరుకోవడం గమనార్హం. 2017లో పార్టీ పేరును, రెండాకుల గుర్తును పళనిస్వామి వర్గానికి ఈసీ కేటాయించడంపై సుప్రీం కోర్టులో సవాల్ చేయబోతున్నట్లు శశికళ తరపు న్యాయవాది ఇప్పటికే ప్రకటించారు. త్వరలో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆమె తరపు న్యాయవాది రాజా సెంతూర్ పాండియన్ తెలిపారు. జయలలిత మరణానంతరం 2016లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారని, అందువల్ల ఆమెకు ఆ పార్టీ పతాకాన్ని కారుకు అమర్చుకునే అధికారం ఉందని టీటీవీ దినకరన్ తాజాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bangalore, Jayalalitha, Sasikala, Tamil nadu Politics, Tamilnadu

  తదుపరి వార్తలు