విశాఖ సాగర తీరంలో ఉద్యమ కెరటాలు ఎగసి పడుతున్నాయి.. ఉక్కి పిడికిలి బిగించిన కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమంటున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని.. ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. రోజుకో రూపంలో ఆందోళనలు తెలుపుతున్నాయి కార్మిక సంఘాలు. ఈ ఆందోళనలకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. అయినా కేంద్రం వెనక్కు తగ్గడం లేదు. ప్రవైటీకరణ విషయంలో ముందుకే అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఏపీ బంద్ కు కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రేవేటికరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర బంద్ చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ బందుకు రాష్ట్ర ప్రభుత్వం సహా.. అన్ని పార్టీలు, అన్ని వర్గాలు సహకరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ రాష్ట్ర కమిటీ కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బంద్‌కు అధికార పార్టీ వైసీపీ సంఘీభావం ప్రకటించింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు తిరగవని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణలో కుట్ర కోణం ఉందనుకోవడం లేదని పేర్ని నాని అభిప్రాయపడ్డారు.
మరోవైపు నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలపనున్నారు. ఇప్పటికే రాష్ట్ర బంద్‌కు టీడీపీ తన మద్దతు ప్రకటించింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనా టీడీపీ సిద్దంగా ఉందని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాజకీయంగా, ఆర్ధికంగా, పారిశ్రామికంగా ఏ ప్రత్యేకతా లేకుండా ఇప్పటికే కేంద్రం చేసిందని.. రాష్ట్రం అన్ని విధాల కేంద్రంపై ఆధారపడాలనే కుట్రతోనే ఆంధ్రాబ్యాంక్ కంటే 3 రేట్లు చిన్నదైన యూనియన్ బ్యాంకులో విలీనం చేశారని, ఇప్పుడు రాష్ట్రానికి వన్నె తెచ్చిన నవరత్న హోదా కలిగిన ఏకైక విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రేవేటికరణ చేయాలని చూడడం వివక్షే అని సీఐటీయూ నేతలు మండిపడ్డారు.
విశాఖ ఉక్కుని బయటపడేయాలని కేంద్రం భావిస్తే సొంత ఘనులు కేటాయిస్తే సరిపోతుందని అన్నారు కార్మిక సంఘాలు అంటున్నాయి. 2020లో విశాఖ పరిశ్రమలో పేరుకుపోయిన లక్ష టన్నుల ఐరన్ నిల్వల విలువే 7వేల కోట్లు ఉంటుందని, అలాంటిది 1 లక్ష 50వేల కోట్లు విలువచేసే 30వేల ఎకరాలు భూములు, లక్ష టన్నుల నిల్వలు, లక్ష కోట్ల విలువచేసే యంత్ర పరికరాలు, ఐరన్ వోర్ నిల్వలు మొత్తం కలిపి 6వేల కోట్లకు అమ్మాలని నిర్ణయించడం దారుణమైందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం జరిగే ఈ రాష్ట్ర బంద్ కి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఇక విద్యార్థి, ప్రజా సంఘాలు సైతం సంఘీభావం ప్రకటించారు. వ్యాపారులు సైతం స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తూ ఆయా యాజమాన్యాలు నోటీసులు కూడా ఇచ్చాయి. దీంతో అత్యవసారాలు మినహా అన్ని బంద్ అయ్యే అవకాశం ఉంది.