కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎగ్గుపెట్టేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ జారవిడుకోవడం లేదు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీపై మోదీ సర్కారు పగబట్టిందని పదేపదే ఆరోపిస్తున్న చంద్రబాబు...రెండ్రోజుల క్రితం జరిగిన హైకోర్టు విభజన తీరును కూడా తప్పుబట్టారు. తాజాగా విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో రద్దు కావడం..కేంద్రం పనేనంటూ ఆయన ధ్వజమెత్తారు. ఏపీని దేశంలో భాగంగా కేంద్రం చూడటం లేదని ఆయన ఆరోపించారు. విశాఖ ఉత్సవ్-2018లో భాగంగా తలపెట్టిన ఎయిర్ షో రద్దు కావడం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. ఆర్కే బీచ్‌లో ఎయిర్ షో నిర్వహించేందుకు ట్రయల్స్ కూడా జరిగాయని, చివరకు షోను రద్దు చేశారని విమర్శించారు.
అటు టీడీపీ ఎంపీలు కూడా కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. పార్లమెంటులో ఆవరణ ఆందోళన చేపట్టిన టీడీపీ ఎంపీలు...ఏపీపై కక్ష్య సాధింపులో భాగంగా విశాఖ ఉత్సవ్ 2018లో ఎయిర్ షో రద్దు చేశారని ఆరోపించారు. గతంలో కూడా విరాట్ షిప్ విషయంలో కేంద్రం పక్షపాతంగా వ్యవహరించిందన్నారు. ఈ షిప్‌ను ఏపీకి కేటాయించాలని మూడు నెలల క్రితమే దరఖాస్తు చేస్తే, మహారాష్ట్రకు కేటాయించారని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. అటు ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేశ్ సైతం ఎయిర్ షోను కేంద్రం కుట్రపూరితంగా రద్దు చేయించిందని ఆరోపించారు.
అయితే టీడీపీ నేతల ఆరోపణలను బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. బీజేపీ ఏపీలో ఎదగకుండా అడ్డుకునేందుకే టీడీపీ నేతలు ఇలా విధ్వేష రాజకీయలు చేస్తున్నారని మండిపడుతున్నారు. నారా లోకేశ్ విమర్శలకు బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు కౌంటర్ ఇచ్చారు.