విశాఖ యువతకు హనీ ట్రాప్... 27మంది అమ్మాయిలు అరెస్ట్

హలో.. డేటింగ్ కు వస్తారా అంటూ ఫోన్ లో స్వీట్ వాయిస్... ఒకట్రెండు సార్లు విన్నాక ఎలా ఉంటుందో చూద్దామని వారు సూచించిన వెబ్ సైట్ లో లాగిన్ అయ్యారో ఇక అంతే.

news18-telugu
Updated: October 27, 2019, 2:49 PM IST
విశాఖ యువతకు హనీ ట్రాప్... 27మంది అమ్మాయిలు అరెస్ట్
విశాఖ యువతకు హనీ ట్రాప్... 27మంది అమ్మాయిలు అరెస్ట్
  • Share this:
ఏపీలో సైబర్ నేరాల ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే పలు చోట్ల సైబర్ మోసాలు చోటుచేసుకుంటుండగా... తాజాగా కోల్ కతాకు చెందిన హనీ ట్రాప్ గ్యాంగ్ విశాఖలో యువకులకు డేటింగ్ పేరుతో వలవేసి లక్షలాది రూపాయలు కాజేసిన బాగోతం బయటపడింది. వెబ్ సైట్ లో లాగిన్ అయి తమ వివరాలు ఇస్తే వారిని ట్రాప్ చేసి ముగ్గులోకి దింపడం, ఆ తర్వాత మరిన్ని సేవల కోసం నగదు పంపాలన్న సూచనలు.. చివరికి మోసపోయామన్న నిజం తెలిసి యువత గగ్గోలు... కోల్ కతా కేంద్రంగా సాగుతున్న ఈ రాకెట్ ను విశాఖ పోలీసులు ఛేదించారు.

హలో.. డేటింగ్ కు వస్తారా అంటూ ఫోన్ లో స్వీట్ వాయిస్... ఒకట్రెండు సార్లు విన్నాక ఎలా ఉంటుందో చూద్దామని వారు సూచించిన వెబ్ సైట్ లో లాగిన్ కావడం... వారు చెప్పిన విధంగా లక్షలాది రూపాయలు జమ చేయడం.. చివరికి మోసపోవడం... కోల్ కతా కేంద్రంగా సాగుతున్న హనీట్రాప్ గ్యాంగ్ బాగోతం ఇది. విశాఖకు చెందిన ఓ యువకుడు ఇదే విధంగా కోల్ కతా ముఠా ఉచ్చులో పడ్డాడు. వారు చెప్పిన విధంగా 18 లక్షల రూపాయలు ఆన్ లైన్ లో చెల్లించాడు. మరో యువకుడు 3 లక్షల రూపాయలు చెల్లించాడు. కానీ వారు చెప్పిన విధంగా జరగకపోవడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తీగలాగితే డొంకంతా కదిలింది. కోల్ కతా వెళ్లి సమగ్రంగా దర్యాప్తు సాగించిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 27 మంది యువతులను అరెస్టు చేశారు. ఈ ముఠా సాగిస్తున్న కార్యకలాపాలను ఆధారాలతో సహా పట్టుకోగలిగారు. వీరి నుంచి 36 సెల్ ఫోన్లు, మూడు ల్యాప్ టాప్ లు, ఓ హార్డ్ డిస్క్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

హనీ ట్రాప్ కోసం కోల్ కతా గ్యాంగ్ మొత్తం 48 బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో ఒక్కో దానిలో 5 నుంచి 6 లక్షల రూపాయల నగదు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు టెలికాలర్స్ సహా నిందితులైన 27 మంది యువతులను కోల్ కతాలో అరెస్టు చేసిన పోలీసులు స్ధానిక కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి రిమాండ్ కు పంపారు. ఈ మొత్తం వ్యవహారంలో వందల సంఖ్యలో యువత హనీ ట్రాప్ లో పడినట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు అంతా లక్షల రూపాయలు పోగొట్టుకున్న వారే. డేటింగ్ పేరుతో యువతులు చేస్తున్న పోన్ కాల్స్ బాధితులే. వీరిలో చాలా మంది చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటున్నవారే. దీంతో పోలీసులు ఈ కేసును గోప్యంగా ఉంచి యువకుల వివరాలు బయటకు రాకుండా దర్యాప్తు సాగిస్తున్నారు.

ఈ కేసులో నిందితులు యువకుల ట్రాప్ కోసం ఓక్యులిమ్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వెబ్ సైట్లను, కాల్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. యువకులకు వల వేసేందుకు కాల్ సెంటర్ ను వాడుకుంటున్నారు.ముందుగా వెబ్ సైట్లలో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టడం, వారితో డేటింగ్ చేయాలంటే కాల్ చేయాలని ఫోన్ నంబర్లు ఇవ్వడం, యువకులు ఫొటోలు చూశాక స్పందించపోతే కాల్స్ చేయడం, ఆ తర్వాత బ్యాంకు ఖాతా నంబర్లను వారికి ఇచ్చి నగదు వేస్తే డేటింగ్ ప్రారంభమవుతుందని నమ్మించడం, ఆ తర్వాత ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకోవడం వీరికి సర్వసాధారణంగా మారింది. దీంతో ఈ హనీ ట్రాప్ లో ఇంకా ఎవరెవరు పడ్డారనే అంశంపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వివిధ దర్యాప్తు ఏజెన్సీల సాయంతో కేసులో పురోగతి సాధించాలని భావిస్తున్నారు. అపరిచితుల నుంచి డేటింగ్ పేరుతో కాల్స్ వస్తే స్పందించవద్దని పోలీసులు కోరుతున్నారు.



(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 తెలుగు, సీనియర్ కరస్పాండెంట్)
First published: October 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>