Home /News /politics /

VISAKHA RAILWAY ZONE NOT POSSIBLE CENTRE FILES AFFIDAVIT IN SC

రైల్వేజోన్ ఇవ్వడం కుదరదు : తేల్చేసిన కేంద్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈనెల 24న రాజ్యసభలో ఏపీ విభజన హామీలపై జరిగిన చర్చ సందర్భంగా ఏపీకి రైల్వే జోన్ వస్తుందని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. కానీ, రెండు రోజుల తర్వాత సుప్రీంకోర్టులో కేంద్ర హోంశాఖ వేసిన అఫిడవిట్‌లో జోన్ సాధ్యంకాదని రైల్వేశాఖ చెప్పినట్టు స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...
    ప్రత్యేక హోదా కాదని ఇప్పటికే పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం... ఇప్పుడు రైల్వేజోన్ ఆశల మీద కూడా నీళ్లు చల్లింది. రైల్వేజోన్ ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. విభజన హామీలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ మీద హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో రైల్వేజోన్ మీద కేంద్రం వైఖరిని తేల్చి చెప్పింది.

    విశాఖ రైల్వే జోన్ గురించి సంబంధిత శాఖతో చర్చ జరిగిందని తెలిపింది. ఆ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఇప్పటికే దేశంలో 16 రైల్వే జోన్లు ఉన్నాయని, మరో జోన్ దాదాపు అసాధ్యమనే అభిప్రాయాన్ని రైల్వే శాఖ వ్యక్తం చేసినట్టు హోంశాఖ అఫిడవిట్‌లో పేర్కొంది. నిర్వహణ పరంగా కూడా లాభదాయకం కాదని తెలిపినట్టు హోంశాఖ కోర్టుకు విన్నవించింది. అయితే, దీనిపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు, స్టేక్ హోల్డర్లతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చిన్న లింక్ పెట్టింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మెట్రో విధానానికి అనుగుణంగా ఉంటేనే విజయవాడ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామన్నారు.


    రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 10లోని ఆస్తుల విభజన మీద కూడా కేంద్ర హోంశాఖ వైఖరి స్పష్టం చేసింది. అందులో ఉన్న కేంద్ర సంస్థల ఆస్తులను పంచాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపింది. ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి అవి చెందుతాయని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనకు సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయని.. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రావడం లేనందునే విభజన చట్టం పూర్తిగా అమలు చేయడం ఆలస్యం అవుతోందన్నారు. 753 మంది ఉద్యోగుల విభజన ఇంకా పెండింగ్‌లో ఉందని కోర్టుకు హోంశాఖ తెలిపింది.

    ఈనెల 24న రాజ్యసభలో ఏపీ విభజన హామీలపై జరిగిన చర్చ సందర్భంగా ఏపీకి రైల్వే జోన్ వస్తుందని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. కానీ, రెండు రోజుల తర్వాత సుప్రీంకోర్టులో కేంద్ర హోంశాఖ వేసిన అఫిడవిట్‌లో జోన్ సాధ్యంకాదని రైల్వేశాఖ చెప్పినట్టు స్పష్టం చేసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Supreme Court, Visakha Railway Zone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు