Home /News /politics /

గ్రామ సచివాలయాలతో అధికార వికేంద్రీకరణ.. జగన్ లక్ష్యం ఇదేనా?

గ్రామ సచివాలయాలతో అధికార వికేంద్రీకరణ.. జగన్ లక్ష్యం ఇదేనా?

వైఎస్ జగన్

వైఎస్ జగన్

అమరావతిని పాలనా రాజధానిగా పరిమితం చేసి రాష్ట్రంలో మరో నాలుగు ప్రాంతాలను రాజధానితో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. గ్రామ సచివాలయాల వ్యవస్ధ కూడా భవిష్యత్తులో అందుకు అనుగుణంగా పనిచేయనుంది.

  (సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 విజయవాడ కరెస్పాండెంట్)

  ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయ వ్యవస్ధ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కరప గ్రామంలో మంత్రులతో కలిసి అట్టహాసంగా గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. గాంధీజీ 150వ జయంతోత్సవాలు జరుపుకుంటున్న వేళ మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్య లక్ష్యాన్ని చేరుకునే లక్ష్యంతో ఈ కొంగొత్త వ్యవస్ధను తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఈ వ్యవస్ధ రాకతో భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇది సర్వరోగ నివారిణి అవుతుందా ? అధికార వికేంద్రీకరణ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ? వంటి విషయాలపై ప్రజల్లో చర్చ సాగుతోంది.

  దేశంలోనే తొలిసారిగా లక్షా 26 వేల ఉద్యోగాలను కొత్తగా సృష్టించి భర్తీ చేయడం ద్వారా రికార్డు సృష్టించిన ఏపీ సర్కారు... గ్రామ సచివాలయ వ్యవస్దను అంతే దీటుగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు తగినట్లుగానే గ్రామ వాలంటీర్లతో కలిపి దాదాపు 4 లక్షల మంది సైన్యాన్ని తయారు చేసుకున్న సీఎం జగన్.. రాబోయే ఐదేళ్లలో దీన్నో విజయవంతమైన ప్రయోగంగా మార్చాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. విపక్షాల విమర్శల సంగతి ఎలా ఉన్నా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంత భారీస్ధాయిలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పనతో పాటు గ్రామ సచివాలయాల ద్వారా అధికార వికేంద్రీకరణకు జరుగుతున్న ప్రయత్నాలను మాత్రం సగటు మధ్యతరగతి ప్రజలు, మేథావులు, అధికార వర్గాలు సైతం ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవల పంపిణీలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఇంటి వద్దకే సేవలు అందే విధంగా ప్రభుత్వం చేసిన ఏర్పాటు కచ్చితంగా సగటు మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేదిగానే చెప్పవచ్చు.

  అదే సమయంలో రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణకు జరుగుతున్న ప్రయత్నాల్లో దీన్ని తొలి అడుగుగా కూడా అభివర్ణించవచ్చు. అధికార పగ్గాలు ఎప్పుడూ కేంద్రీకృతంగానే ఉండాలని భావించే నేటి రాజకీయ వర్గాల అభిప్రాయాలకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా వారిని నిరుత్సాహపరిచేదిగానే ఉందని చెప్పక తప్పదు. ఇప్పటికే అమరావతిని పాలనా రాజధానిగా పరిమితం చేసి రాష్ట్రంలో మరో నాలుగు ప్రాంతాలను రాజధానితో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. గ్రామ సచివాలయాల వ్యవస్ధ కూడా భవిష్యత్తులో అందుకు అనుగుణంగా పనిచేయనుంది. దీంతో అధికార వికేంద్రీకరణ దిశగా చేపట్టిన గొప్ప ముందడుగుగా దీన్ని చెప్పవచ్చు.

  వ్యవస్ధలు ఎంత గొప్పగా ఉన్నాయన్నది అవి పనిచేసే విధానాన్ని బట్టి, కాలమాల పరిస్ధితులకు తట్టుకునే దాన్ని బట్టి, విమర్శలకు అతీతంగా వ్యవహరించే దాన్ని బట్టే నిర్ధారణ అవుతుంది. ప్రస్తుత పరిస్ధితుల్లో రాజకీయ జోక్యాన్ని అన్ని వ్యవస్ధల నుంచి పారద్రోలాలన్న సీఎం జగన్ లక్ష్యానికి ఇది తొలి పరీక్ష కాబోతోంది. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల వ్యవస్ధలో సొంత పార్టీ వైసీపీ నేతలకే పెద్దపీట వేశారంటూ విమర్శలు ఎదురయ్యాయి. గ్రామ సచివాలయ ఉద్యోగాల విషయంలోనూ పేపర్ లీకేజీ పేరుతో జరిగిన ప్రచారం కూడా ప్రభుత్వానికి ఓ దశలో తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయ వ్యవస్ధ రేపు అవినీతి రహితంగా, నిష్పక్షపాతంగా ఎలా పనిచేయబోతోందో అని రాష్ట్రంలో ప్రజానీకం ఆసక్తిగా గమనిస్తోంది.

  భారీ స్ధాయి వ్యవస్ధ కావడం, స్థానికంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటం, అధికార వికేంద్రీకరణ వల్ల రాష్ట్ర సచివాలయం పెత్తనం తగ్గిపోవడం వంటి కారణాలతో రేపు ప్రభుత్వానికి ఈ వ్యవస్ధ మీద పూర్తిస్దాయి గుత్తాధిపత్యం ఉంటుందా లేదా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మంచి జరిగితే అదే తామే చేసినట్లు, చెడు జరిగితే ఎదుటివారే చేసినట్లు తీర్పులిచ్చే సమాజంలో గ్రామ సచివాలయాల్లో జరిగే ప్రతీ లావాదేవీ మీద అందరి దృష్టీ ఉంటుంది. ఎక్కడ ఏ పొరబాటు జరిగినా అది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేయించడమో, చూసీ చూడనట్లుగా వదిలేసిందో అన్న విమర్శలు వెల్లువెత్తుతాయి. అందుకే నిరంతర పర్యవేక్షణ, తప్పుజరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్న సంకేతాలు ఇవ్వడం ద్వారా గ్రామ సచివాలయ వ్యవస్ధను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండబోతోంది.
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Village secretariat, Ys jagan, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు