వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభకు సారీ చెప్పారు. ఏపీ విభజన చట్టంపై నిన్న రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా జరిగిన ఘటనపై ఆయన చైర్మన్‌కు క్షమాపణ చెప్పారు. అలా జరిగి ఉండాల్సింది కాదని.. జరిగిన దానికి చింతిస్తున్నట్టు తెలిపారు. నిన్న రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చే ముందు తమకు ఓసారి అవకాశం ఇవ్వాలని విజయసాయిరెడ్డి చైర్మన్‌ను కోరారు. అయితే, ఇప్పటికే ఓసారి సమయం ఇచ్చాం కాబట్టి.. మళ్లీ ఇవ్వడం కుదరదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
వెంకయ్యనాయుడు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ.. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లారు. చైర్మన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమకు అన్యాయం చేస్తున్నారంటూ సభలో గట్టిగా అరుస్తూ వెంకయ్య మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది న్యాయం కాదంటూ సభ నుంచి వాకౌట్ చేశారు.
ఇవాళ రాజ్యసభ ప్రారంభంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి విజయ్ గోయల్ ఈ విషయాన్ని సభలో ప్రస్తావించారు. సభా గౌరవాన్ని, చైర్మన్ గౌరవాన్ని కాపాడాలని, సభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దీన్ని సభ ఖండించాలని సూచించారు. అదే సమయంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కూడా రియాక్ట్ అయ్యారు. ఏదైనా సమస్య ఉంటే చైర్మన్ ఛాంబర్, బీఏసీలో గట్టిగా మాట్లాడాలి కానీ, ఇలా సభలో మాత్రం చైర్మన్ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు.
దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి తానే ఈ అంశంపై మాట్లాడాలనుకున్నానని చెప్పారు. నిన్న చాలా ఎమోషనల్ అంశం మీద చర్చ జరుగుతోందని.. ఏపీ నుంచి ఎన్నికైన వ్యక్తిగా తనకు సరైన సమయం దొరకలేదన్న బాధ ఉందన్నారు. అందుకే తాను ఆ విధంగా వ్యవహరించానన్న ఎంపీ.. అందుకు క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.