తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధినేత చంద్రబాబు నాయుడుపై ( Nara Chandrababu Naidu) రాష్ట్ర మంత్రి కొడాలి నాని (Kodali Nani) మండిపడ్డారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన నాని.. టీడీపీ నేతలను కూడా తూర్పారబట్టారు. తెలుగుదేశం పార్టీ దొంగపార్టీ అని.. ఎన్టీఆర్ ఆశయాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. డ్రామా ఆర్టిస్టుల మాదిరిగా నాటకాన్ని రక్తికట్టించారని మండిపడ్డారు. వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబు.. ప్రజలను మనుషులుగా కూడా గౌరవించలేని వ్యక్తి అని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు బుద్ధిలేదు, సిగ్గులేదు, మీరు మనిషులేనా అని ప్రశ్నించిన అవమానించిన వ్యక్తి చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ నాగలోకం అయితే చంద్రబాబు నక్కతో సమానమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగింది టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కాదు.. పగటివేషగాళ్ల డ్రామా అని ఎద్దేవా చేశారు. టీడీపీకి అధ్యక్షుడిగా కొనసాగే హక్కు చంద్రబాబుకు లేదని.. అలాగే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించే స్థాయి కూడా లేదన్నారు. సెప్టెంబర్ 1న వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కాదని చెప్పారు.
అప్పులు కనిపించలేదా..?
రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయని విమర్శలు చేస్తున్నవారికి.. చంద్రబాబు చేసిన అప్పులు కనిపించలేదా అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు 3లక్షల 60వేల కోట్ల అప్పులు తెచ్చి దుబారా చేశారని విమర్శించారు. చంద్రబాబు ఏమైనా అమరావతి బ్యాంక్ పెట్టుకొని పక్కరాష్ట్రాలకి, కేంద్రానికి, సింగపూర్ కి అప్పులిచ్చారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా సమయంలో అప్పులు చేసి మరీ ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారని వివరించారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు రూ.90వేల కోట్ల అప్పులు తెచ్చి నిరుపేదల ఎకౌంట్లో డబ్బులు వేసి వారిని రక్షించారని నాని అన్నారు. సీఎం చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించారన్నారు.
ఎన్టీఆర్, వైఎస్ఆర్ కు నిజమైన వారసుడు వైఎస్ జగన్ అని కొడాలి నాని అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో జగన్ లాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు ప్రజలు ఆనందపడుతున్నారన్నారు. చంద్రబాబు చరిత్ర అంతా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకోవడమేని.., ప్రజల మద్దతుతో సీఎం అయిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా చంద్రబాబును కాపడలేకపోయారు. ఎన్టీఆర్ కు రాజకీయాలు తెలియవు కాబట్టే.., ఆయన పార్టీని, పదవిని లాక్కొని చంద్రబాబు సీఎం అయ్యారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడిననా రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్తూనే ఉంటారు.
తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా తిరుమల శ్రీవారిపై రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. శ్రీవారి తలనీలాల వ్యవహారాన్ని ఎన్నికల కోసం వాడుకుంటున్నారన్నారు. ఓ జాతీయ పార్టీ నోటాను క్రాస్ చేసేందుకు నానా తంటాలు పడుతోందని బీజేపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మరో పార్టీ డిపాజిట్లు వస్తే చాలని దేవుడికి మొక్కుతోందన్నారు. మరోపారి మెజారిటీలో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైందని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేవుడ్ని అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నవారికి ఉపఎన్నికలో వెంకటేశ్వరస్వామి బుద్ధి చెప్తాడన్నారు. తిరుపతిలో 5 లక్షల మెజారిటీతో వైసీపీ గెలిచేలా దేవుడు ఆశీర్వదిస్తాడన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.