ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు జనసేన-బీజేపీ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ తరపున రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగితే.. టీడీపీ తరపున ఇప్పటికే ముఖ్యనేతలంతా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. గురువారం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రచారం చేయనున్నారు. బీజేపీ తరపున ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయగా.. కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్యనేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఐతే అధికార వైఎస్ఆర్పీ తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీన జగన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఐతే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రాని జగన్.. ఉపఎన్నిక ప్రచారానికి ఎలా వస్తారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
సీఎం జగన్ రాకకు మరో కారణం ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. తిరుపతి లోక్ సభ పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పరిస్థితి ఆశించిన మేరకు లేదని.. ఇదే విషయాన్ని పార్టీ వర్గాలు సీఎం జగన్ కు తెలిపారంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే ఇంటెలిజెన్స్ నివేదికలో కూడా ఇదే సమాచారం ఉండటంతో తానే స్వయంగా రంగంలోకి దిగాలని జగన్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని చెప్పే ప్రయత్నంలో సీఎం జగన్ ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో పాటు తిరుమలలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తాను ప్రచారం చేయాలని జగన్ భావిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఐతే దీనిపై వైఎస్ఆర్సీపీ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే తిరుపతిలో ప్రచారం చేస్తున్న మంత్రులుగానీ, తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నుంచిగానీ ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఐతే సీఎం జగన్ తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి వస్తున్నారన్న వార్తలపై ప్రతిపక్ష టీడీపీ స్పందించింది. ఓటమి భయంతోనే జగన్ తిరుపతి వస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రజలు ఎదురుతిరుగుతారన్న ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవ్వడంతో జగన్ వస్తున్నారన్నారు. సీఎం జగన్ ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని మంత్రులు పైకి చెప్తున్నా అందులో నిజం లేదని.. జగన్ కు ఓటమి భయం పెట్టుకుందని దేవినేని ఉమా విమర్శించారు. మొత్తానికి జగన్ పర్యటనపై ఇంతవరకు క్లారిటీ రాకపోయినా ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.