news18-telugu
Updated: December 1, 2020, 3:11 PM IST
కాషాయ మాస్క్ ధరించిన విజయశాంతి
తెలంగాణ(Telangna)లో కొన్ని రోజులుగా విజయశాంతి (Vijayashanti) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ (Congress) పార్టీపై అసంతృప్తిగా ఉన్న రాములమ్మ.. బీజేపీలోకి వెళ్తారని దుబ్బాక ఎన్నికలకు ముందు నుంచీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత టీఆర్ఎస్పై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు విజయశాంతి. అదే సమయంలో బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలవేళ ఆమె బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఎన్నికల ప్రచారం కోసం జేపీ నడ్డా, అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చారు. వారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు షికారుచేశాయి. కానీ అలా జరగలేదు. ఐతే ఎట్టకేలకు బీజేపీలో రాములమ్మ చేరికకు ముహూర్తం ఖరారయినట్లు తెలుస్తోంది.
విజయశాంతి ఈ నెల 7న ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ కేంద్రం కార్యాలయంలో ఆ పార్టీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇవాళ ఓటుహక్కు వినియోగించుకున్న విజయశాంతి.. ముఖానికి కాషాయ మాస్క్ ధరించి సర్ప్రైజ్ ఇచ్చారు. అన్ని పార్టీలు నేతలు, అనచరులు తమ పార్టీ రంగులోనే మాస్క్‌లు ధరించి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. టీఆర్ఎస్ నేతలు గులాబీ రంగు మాస్క్, టీడీపీ నేతలు పసుపు రంగు, ఎంఐఎం నేతలు గ్రీన్ కలర్ మాస్క్ ధరించి కనిపించారు. ఈ క్రమంలో విజయశాంతి కాషాయ మాస్క్ ధరించడంతో.. ఆమె బీజేపీలో చేరిక ఖరారయిందని స్పష్టమవుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. బీజేపీ పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ పార్టీలో చేర్చుకుంది. కేవలం ఈ ఎన్నికల వరకే కాదు.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. ఇప్పటి నుంచే పక్కాగా వ్యూహాలను రచిస్తోంది. ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను తమ వైపు ఆకర్షిస్తోంది. దుబ్బాకలో బీజేపీ విజయంతో పక్క పార్టీల్లోని నేతలు కూడా కాషాయం వైపు చూస్తున్నారు. ఇటీవలే శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్.. టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరారు. ఇక విజయశాంతి ఈ నెల 7న బీజేపీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నేతలు కూడా కాషాయ దళంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Published by:
Shiva Kumar Addula
First published:
December 1, 2020, 3:03 PM IST