news18-telugu
Updated: November 19, 2020, 8:28 AM IST
విజయశాంతి (ఫైల్ ఫోటో)
వరద సాయం పేరుతో సీఎం కేసీఆర్ ఓట్ల రాజకీయానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ప్రస్తుతం పరిణామాలను చూస్తుంటే గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉద్దేశ్యపూర్వకంగానే వరదసాయాన్ని జాప్యం చేసినట్లు స్పష్టమవుతోందని ఆమె ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాదులో భారీ వర్షాల వల్ల బాధితులైన ముంపు ప్రాంతాల ప్రజలకు వరద సాయం పేరిట కేసీఆర్ దొరగారి సర్కారు ఓట్ల రాజకీయానికి పాల్పడిందనడం కాదనలేని సత్యం అని విమర్శించారు. భారీ వర్షాలు కురిసి దాదాపు 3 వారాలు దాటుతున్నా తెలంగాణ సర్కారు ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించలేకపోయిందని ధ్వజమెత్తారు.
ఇచ్చిన పరిహారం కూడా అపహాస్యం పాలైందన్నారు. టీఆర్ఎస్ నేతలు సూచించినవారికి మాత్రమే చాలా చోట్ల వరద సాయం అందిందని ఆరోపించారు. నిజమైన బాధితులను విస్మరించి విమర్శలపాలయ్యారని వ్యాఖ్యానించారు. బల్దియా ఎన్నికలు కేవలం 2 వారాలే ఉన్న నేపథ్యంలో పరిహారం అందని వరద బాధితుల్ని మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోమని చెప్పి, వారిని ఊపిరాడకుండా చేసి ఒక మహిళ మృతికి కూడా కారణమయ్యారని విజయశాంతి ఆరోపించారు.
ఈ చర్య గ్రేటర్ ఎన్నికల కోసం ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నమే అన్నారు. టీఆర్ఎస్ కుట్రను ఎన్నికల సంఘం గుర్తించి, ఎన్నికలయ్యే వరకూ వరద సాయం ఆపమని ఆదేశిస్తే.... ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చెయ్యడం వల్లే సాయం ఆపామనడం అర్థంలేని వాదన అని విమర్శించారు. ఇదంతా అడలేక మద్దెల ఓడు అన్నట్టుంది. ప్రభుత్వం చేతగానితనం, కేసీఆర్ దొరగారి కుట్రను అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళు కాదు ఓటర్లు అంటూ వ్యాఖ్యానించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 19, 2020, 8:28 AM IST