news18-telugu
Updated: November 23, 2020, 1:21 PM IST
విజయశాంతి (ఫైల్ ఫోటో)
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న వియశాంతి బీజేపీలో చేరుతున్నట్టుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె బీజేపీలోకి చేరే తేదీపై స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రేపు(మంగళవారం) కాషాయ కండువా కప్పుకొనున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్న విజయశాంతి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టుగా సమాచారం. ఈ సందర్భంగా ఢిల్లీలో పలువులు బీజేపీ ముఖ్య నేతలను కూడా విజయశాంతి కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన తర్వాత ఆమె గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాములమ్మ ప్రచారం ఆ పార్టీకి మరింత బూస్టప్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే విజయశాంతి పార్టీ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాంగ్రెస్ తరఫున బలమైన వాయిస్ వినిపించిన విజయశాంతి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా పార్టీకి మద్దతుగా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దుబ్బాక ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలోనే ఆమెతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అప్పుడే ఆమె బీజేపీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత పులువురు కాంగ్రెస్ నేతలు విజయశాంతితో చర్చలు జరపడంతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే విజయశాంతి పార్టీ మార్పునకు చాలా రోజులుగా అంతర్గతంగా చర్చలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి కూడా ఆమెకు రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన హామీ లభించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, గత కొంతకాలంగా కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలు బీజేపీలో క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్‌లతో మరికొందరకు నేతలు కూడా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఈ పరిస్థితులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. తాజాగా విజయశాంతి కూడా బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తే కాంగ్రెస్‌కు భారీ నష్టం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Published by:
Sumanth Kanukula
First published:
November 23, 2020, 1:21 PM IST