వైఎస్‌ఆర్‌కు కేవీపీ... జగన్‌కు విజయసాయిరెడ్డి... వైసీపీలో ఆసక్తికర చర్చ

జగన్ విజయసాయిరెడ్డి మధ్య ఉన్న సంబంధాలను గమనిస్తున్న కొందరు...గతంలో జగన్ తండ్రి, ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌, కేవీపీలను గుర్తు చేసుకుంటున్నారు.

news18-telugu
Updated: May 17, 2019, 6:09 PM IST
వైఎస్‌ఆర్‌కు కేవీపీ... జగన్‌కు విజయసాయిరెడ్డి... వైసీపీలో ఆసక్తికర చర్చ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటోలు)
  • Share this:
రాజకీయాల్లో నాయకులకు నమ్మకస్తుల అవసరం ఎంతో ఉంటుంది. ఎవరినీ నమ్మలేమని భావించే రాజకీయ రంగంలో కచ్చితంగా ఎవరో ఒకరిని పూర్తిగా నమ్మవలసిన పరిస్థితి ఉంటుంది రాజకీయ నాయకులది. అలా నేతల మెప్పుపొందని వాళ్లే... వారి రాజకీయ ప్రయాణంలో కీలకంగా మారుతుంటారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో శక్తిగా ఎదిగే అవకాశం ఉందని భావిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లొచ్చిన విజయసాయిరెడ్డి... వైసీపీలో ఈ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తారని ఎవరూ అనుకోలేదు.

రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని విజయసాయిరెడ్డి తమ పార్టీలో చక్రం తిప్పుతారని ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు కూడా అంచనా వేయలేకపోయారు. అయితే జగన్ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న విజయసాయిరెడ్డి... ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా ఎదిగిపోయారు. జగన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న విజయసాయిరెడ్డి... పార్టీకి సంబంధించి అన్ని వ్యవహారాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీలతో సంబంధాలు, జాతీయ స్థాయిలోని పార్టీలతో సంబంధాలు, పార్టీల్లో నేతల చేరికలు, ఈసీతో సమన్వయం ఇలా ఏది చూసుకున్నా... అందులో విజయసాయిరెడ్డి ముందుంటున్నారు.

మరోవైపు జగన్ విజయసాయిరెడ్డి మధ్య ఉన్న సంబంధాలను గమనిస్తున్న కొందరు...గతంలో జగన్ తండ్రి, ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌, కేవీపీలను గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్‌కు కేవీపీ ఎలాగైతే నమ్మకంగా వ్యవహరించారో... ఇప్పుడు జగన్‌కు విజయసాయిరెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తున్నారని చర్చించుకుంటున్నారు. వైఎస్, కేవీపీలు మధ్య ఉన్న స్నేహబంధం రాజకీయాల్లోనూ వారిని రాణించేలా చేసింది. వైఎస్ఆర్ ప్రతి నిర్ణయంలో కేవీపీ పాత్ర ఉంటుందనే విషయం ఆయన సన్నిహితులందరికీ తెలుసు. ప్రస్తుతం జగన్ తీసుకునే నిర్ణయాల్లోనూ విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల తరువాత వైసీపీ కేంద్రంలో ఎలాంటి పాత్ర పోషించనుంది ? అందులో విజయసాయిరెడ్డి పాత్ర ఏ విధంగా ఉండబోతోందనే అంశంపై కూడా ఆసక్తి నెలకొంది. రాజకీయాల్లో అంతగా అనుభవం లేని విజయసాయిరెడ్డి... సంకీర్ణ ప్రభుత్వంలో వైసీపీ పాత్ర సమర్థవంతంగా ఉండేలా వ్యూహరచన చేస్తారా అన్నది కీలకం కానుంది.

First published: May 17, 2019, 6:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading