news18-telugu
Updated: April 19, 2020, 2:35 PM IST
విజయసాయిరెడ్డి (File)
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ అధినేత చంద్రబాబు కొనేశారని వైసీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. రూ.20 కోట్లకు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. వారిద్దరి మధ్య డీల్ సెట్ చేసింది బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ మాజీ నేత అయిన సుజనా చౌదరి మధ్యవర్తిత్వం నిర్వహించి చంద్రబాబు, కన్నాను కలిపారని అన్నారు. అందుకే చంద్రబాబు తరహాలోనే కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వరుసగా విమర్శల దాడి చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంశం, ఆ తర్వాత కరోనా పరీక్షలు, పేదలకు సాయం వంటి అంశాల్లో ప్రభుత్వానికి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతోపాటు కేంద్ర పెద్దలకు కూడా కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ మీద ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా దక్షిణ కొరియా నుంచి రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న కరోనా కిట్స్ విషయంలో జగన్ ప్రభుత్వం కమిషన్ కొట్టేసిందా అని కన్నా ప్రశ్నించారు. పొరుగున ఉన్న ఛత్తీస్ గఢ్ సర్కారు ఒక్కో కిట్ రూ.337 + జీఎస్టీ చెల్లిస్తుండగా, ఏపీ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ మొత్తం చెల్లించందనే అనుమానాన్ని కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తం చేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
April 19, 2020, 2:30 PM IST