ప్రియాంక గాంధీ సడెన్‌గా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీకోసం అప్పుడప్పుడు మాత్రమే పనిచేసిన ఆమెపై అధిష్టానం ఇప్పుడు ఒక్కసారిగా తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను ఎందుకు అప్పగించారో తెలుసా? అందరూ ఏమనుకుంటున్నారో తెలియదు గానీ, వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచీ మాత్రం అందుకుగల కారణాన్ని తన వర్షన్‌లో వివరించారు. ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ.. ఏ క్షణంలోనైనా జైలుకెళ్లే అవకాశం ఉందని, అందుకే ప్రియాంకను కాంగ్రెస్‌లోకి తీసుకు వచ్చారని సాధ్వి చెప్పారు. ఎన్ఎస్‌యూఐ నేత ఇర్ఫాన్ హుస్సేన్ వేధింపులకు గురైన ఓ విద్యార్థినిని పరామర్శించేందుకు షాజహాన్‌పూర్‌కు వచ్చిన సాధ్వి.. దేశంలో ఆడపిల్లల భవిష్యత్తును కాంగ్రెస్ నేతలు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాలికలు బాగా చదువుకోవాలని నరేంద్రమోదీ ప్రోత్సహిస్తుంటే.. అలా జరగొద్దని కాంగ్రెస్ కోరుకుంటోందని విమర్శించారు.
ఇక.. రాహుల్, సోనియా ఎప్పుడైనా జైలుకెళ్లే అవకాశం ఉండడంతో.. కాంగ్రెస్ పార్టీ ప్రియాంకను తెరమీదకు తెచ్చిందని సాధ్వి అన్నారు. ఆమె తప్ప కాంగ్రెస్ పార్టీకి మరో మార్గం లేదన్నారు. ప్రియాంక వచ్చినంత మాత్రాన.. 2019 ఎన్నికల్లో పెద్ద మార్పేమీ ఉండబోదన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో 19 మంది ప్రధాని అభ్యర్థులున్నారని ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Narendra modi, Priyanka Gandhi, Rahul Gandhi, Sonia Gandhi, VHP