తెలంగాణ రాజకీయాల్లో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు క్యూ కట్టబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ లిస్టులో మాజీ ఎంపీ, మాజీ క్రికెట్ అజరుద్దీన్ పేరు కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
తాజా ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో.. ఆ పార్టీ నుంచి గెలిచిన 19 ఎమ్మెల్యేల్లో చాలామంది కారెక్కేందుకు రెఢీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలువురు మాజీలు సైతం.. గులాబీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో ప్రధానంగా మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ మహ్మద్ అజరుద్దీన్ కూడా ఉన్నట్టుగా రాజకీయవర్గాల్లో పుకార్లు షికారు చేశాయి.
అయితే, తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన పుకార్లను ఖండించారు అజరుద్దీన్. ట్విట్టర్ వేదికగా స్పందించిన అజర్, తాను టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధమని స్పష్టం చేశారు. ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ పార్టీ తరపున 2009లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచిన అజరుద్దీన్.. 2014లో ఓటమిచెందారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకుపడ్డారు. అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలవడంతో ఆయన.. టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు, సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున ఆయనే పోటీ చేస్తారన్న పుకార్లూ వినిపించాయి. అయితే అవన్నీ ఉత్తుత్తి పుకార్లేనని కొట్టిపారేశారు అజరుద్దీన్. తాను పార్టీ మారడం లేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
The news doing the rounds in the media of me joining the TRS party in Telangana is incorrect & false.
— Mohammed Azharuddin (@azharflicks) January 2, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Azaharuddin, Congress, Mahakutami, Telangana, Telangana Election 2018, Telangana News, Trs, Uttar pradesh