అసెంబ్లీలో సీఎం కేసీఆర్, అక్బరుద్దీన్ మధ్య మాటల యుద్ధం

Telangana Assembly: అక్బరుద్దీన్ ప్రభుత్వం మీద విమర్శల దాడి చేస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ అడ్డు చెప్పారు. మహాభారతం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందన్నారు.

news18-telugu
Updated: September 9, 2020, 2:26 PM IST
అసెంబ్లీలో సీఎం కేసీఆర్, అక్బరుద్దీన్ మధ్య మాటల యుద్ధం
అక్బరుద్దీన్, సీఎం కేసీఆర్
  • Share this:
CM KCR vs Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యల మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సభలో ప్రకటన చేశారు. అనంతరం ప్రభుత్వం ప్రకటన మీద అక్బరుద్దీన్ ఒవైసీ పెదవి విరిచారు. కరోనా వల్ల ఆర్థికంగా, వ్యాపారపరంగా, సామాజికంగా, విద్య పరంగా అన్ని వర్గాల మీద ప్రభావం చూపిందని అక్బరుద్దీన్ అన్నారు. ప్రజల జీవితాల మీద తీవ్ర ప్రభావం చూపిన కరోనా గురించి ప్రభుత్వం చేసిన పనులను కూడా కనీసం చెప్పుకోలేకపోయిందన్నారు. ప్రభుత్వ ప్రకటన కేవలం హెల్త్ బులెటిన్‌లా ఉందని పెదవి విరిచారు. పేదలకు రేషన్, డబ్బులు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రభుత్వం చెప్పుకోలేకపోయిందన్నారు. కనీసం మీరు చెప్పలేకపోయినా మేం చెబుతామంటూ కరోనా వారియర్స్‌కు సెల్యూట్ చేశారు. అక్బరుద్దీన్ ఇలా ప్రభుత్వం మీద విమర్శల దాడి చేస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ అడ్డు చెప్పారు. మహాభారతం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందన్నారు. అయితే, దీనికి అక్బరుద్దీన్ అభ్యంతరం తెలిపారు. తానేమీ మహాభారతం చెప్పలేదన్నారు. దీంతో నేను మీకుచెప్పడం లేదంటూ కేసీఆర్ గట్టిగా చెప్పారు. సభలో కేసీఆర్ మాట్లాడుతుండగానే అక్బరుద్దీన్ గట్టిగా అరుస్తూ మాట్లాడారు. దీనిపై స్పందించిన సీఎం అంత గట్టిగా అరవడం ఎందుకంటూ చురకలు అంటించారు. అదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కరోనా ప్రభావం ప్రపంచం అంతా పడిందని, కానీ, అన్నీ ప్రభుత్వం రాయలేం కదా అని అన్నారు. కరోనా సేవలు అందిస్తున్న డాక్టర్లకు, మున్సిపల్ కార్మికులకు ప్రోత్సాహకం కింద డబ్బులు ఇచ్చిన విషయాలు ఉన్నా కూడా చెప్పలేదన్నారు. ఆ విషయం ప్రపంచానికి తెలుసని, దాని మీద నిరసన తెలపడం సరికాదన్నారు. దీన్ని ప్రభుత్వం ఫెయిల్యూర్ అనడం సరికాదన్నారు. అయితే, తాను ప్రభుత్వం విఫలమైందనే మాట అనలేదని, చేసిన పని కూడా చెప్పుకోలేదన్న అభిప్రాయాన్నే తాను వ్యక్తం చేశానని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా త్వరగా ముగించాలంటూ స్పీకర్ పోచారం అక్బరుద్దీన్ ఒవైసీకి సూచించారు. దీంతో అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంట ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వెళ్లిపోయారు. అయితే, అక్బరుద్దీన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం గమనార్హం.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 9, 2020, 2:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading