news18-telugu
Updated: November 19, 2020, 5:34 PM IST
వేములవాడలో ప్రజల భిక్షాటన
వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. కరోనా కాలంలోనూ కంటికి నిపించడంలేదని మండిపడుతున్నారు. నియోజకవర్గంలో రైతులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నా ఎమ్యెల్యే జాడలేకపోవడంతో నిరసన తెలియజేస్తున్నారు. ప్రజల ఓట్లతో గెలిసి.. జర్మనీలో ఉంటున్న ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్‌పై స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జర్మనీలో ఉన్న రమేష్ బాబును నియోజకవర్గానికి రప్పించేందుకు విమాన చార్జీల కోసం గురువారం వేములవాడ రాజన్న ఆలయం ఎదుట భిక్షాటనకు దిగారు. జర్మనీ నుంచి తమ ఎమ్మెల్యేను ప్రత్యేక విమానం ద్వారా తీసుకురావాలని డబ్బు జమ చేస్తున్నామని వారు తెలిపారు. సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రజా సమస్యలపై పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని గతంలోనూ రమేష్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యే కనపడుటలేదంటూ పోలీసులు సైతం స్థానికులు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోవడంతో భిక్షాటన చేస్తూ వినూత్న నిరసనకు దిగారు.

చెన్నమనేని రమేశ్(ఫైల్ ఫోటో)
మరోవైపు టీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు జర్మనీ పౌరసత్వంపై చాలా రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందా? లేదా? పాస్‌పోర్ట్ ఉందా? లేదా? అనే వివరాలపై జర్మన్ కాన్సులేట్‌కు లేఖరాసి సృష్టత తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం కేసులపై జస్టిస్ చల్లా కోదండరాం ధర్మాసనం బుధవారం మరోమారు విచారణ జరిపింది. మరోవైపు పాస్‌పోర్ట్ ను కోర్టుకు సమర్పించాలని రమేశ్‌కు ధర్మాసనం సూచించింది. విచారణకు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.
చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడని, ఆయన భారత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు కాబట్టి, ఆయన ఎన్నికను కొట్టివేయాలంటూ ఆది శ్రీనివాస్ అనే నాయకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చాలా రోజుల నుంచి విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో చెన్నమనేని రమేష్‌కు భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది కేంద్ర హోంశాఖ. అయితే, దాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్ చేశారు. తనకు భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని చెన్నమనేని రమేష్ హైకోర్టుకు విన్నవించుకున్నారు.
చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని, ఆ దేశ పాస్ పోర్టుతో మద్రాస్ నుండి జర్మనీ వెళ్లారని కేంద్ర హోంశాఖ గతంలోనే కోర్టుకు తెలిపింది. భారత పౌరసత్వం కలిగి ఉంటే జర్మనీ పాస్ పోర్టుతో ఎందుకు వెళ్లావని చెన్నమనేని రమేష్‌ను హైకోర్టు ఇదివరకే ప్రశ్నించింది. ఈ పౌరసత్వ వివాదంపై ఇప్పటికీ వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా, జర్మన్ కాన్సులేట్‌కు లేఖ రాసి తెలుసుకోవాలని హైకోర్టు సూచించింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 19, 2020, 5:24 PM IST