తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై గజ్వేల్‌లో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి... టీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నాం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై స్పందించేందుకు వంటేరు ప్రతాప్ రెడ్డి... ఆయన కుమారుడు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ముఖ్యనేతలతో పార్టీ మార్పుపై వంటేరు ప్రతాప్ రెడ్డి చర్చలు జరిపారని... అవి ఫలించడంతో ఆయన కారెక్కేందుకు సిద్ధమయ్యారని సమాచారం. వంటేరు ప్రతాప్ రెడ్డికి ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ నాయకత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ వ్యూహం ఇదే ?
మరోవైపు గజ్వేల్‌లో తన రాజకీయ ప్రత్యర్థి అయిన వంటేరు ప్రతాప్ రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం వెనుక కేసీఆర్ వ్యూహాం వేరే ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్... ఆ తరువాత గజ్వేల్ నుంచి పోటీ చేసే అవకాశం ఎవరికి ఇవ్వాలనే దానిపై తీవ్రంగానే సమాలోచనలు జరిపారని తెలుస్తోంది. గజ్వేల్‌లో కేసీఆర్ మినహా ఎవరు పోటీ చేసినా వంటేరు ప్రతాప్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టమవుతుందనే అంచనాకు వచ్చిన గులాబీ బాస్... వంటేరును టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చి ఆ తరువాత గజ్వేల్ ఎమ్మెల్యే బరిలో నిలపవచ్చని యోచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్న కేసీఆర్... గజ్వేల్ నుంచి టీఆర్ఎస్ తరపున వంటేరు ప్రతాప్ రెడ్డిని బరిలో ఉంచితే...ఆ సీటు మళ్లీ టీఆర్ఎస్ ఖాతాలోనే ఉంటుందని ఆలోచిస్తున్నట్టు బలంగా నమ్ముతున్నారు.
హరీష్‌రావు రాయబారం లేకుండానే ?
సాధారణంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి టీఆర్ఎస్‌లో ఎలాంటి చేరికలు ఉన్నా... అందులో మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాత్ర కచ్చితంగా ఉంటుంది. అయితే తాజాగా వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం వెనుక రాయబారం ఎవరది అనే అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. కొందరు వంటేరు ప్రతాప్ రెడ్డి కారెక్కడం వెనుక కూడా హరీష్ రావు పాత్ర ఉండొచ్చని అంటుంటే... ఈ మధ్యకాలంలో హరీష్ రావు అలాంటి ప్రయత్నాలు చేయలేదని మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి వంటేరు ప్రతాప్ రెడ్డితో చర్చలు జరిపారనే టాక్ కూడా వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Gajwel, Harish Rao, Telangana, Trs