హోమ్ /వార్తలు /రాజకీయం /

వల్లభనేని, యార్లగడ్డ మాటలయుద్ధం వెనుక భారీ వ్యూహం ఏంటి ?

వల్లభనేని, యార్లగడ్డ మాటలయుద్ధం వెనుక భారీ వ్యూహం ఏంటి ?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వల్లభనేని వంశీ

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వల్లభనేని వంశీ

కొడాలి నానితో కలిసి ఓదార్పుయాత్రలో పాల్గొంటున్న జగన్ కు వంశీ ఎదురుపడ్డారు. కొడాలి నాని వంశీని జగన్ కు పరిచయం చేశారు. తర్వాత జగన్, వంశీ ఒకరినొకరు పరస్పరం ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇది అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీకి పార్టీలో తలనొప్పులు తెచ్చిపెట్టింది.

ఇంకా చదవండి ...

  ఒకరేమో వైసీపీ అధినేత జగన్ కు అనుకూలమైన నేత... మరొకరు జగన్ పార్టీ తరఫున పోటీ చేసిన నేత. వీరిద్దరి తాజా పరిస్ధితి చూస్తుంటే వైసీపీ ప్రభుత్వమే గనుక వస్తే ఆధిపత్యం చెలాయించాలనే పట్టుదల. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన వల్లభనేని వంశీమోహన్, వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు మధ్య మాటలయుద్ధం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ వర్గంగా పేరుతెచ్చుకున్న ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, కొడాలి నాని స్నేహం ఇప్పుడు గన్నవరం రాజకీయాలను సమూలంగా మార్చేసేలా కనిపిస్తోంది. 2014 ఎన్నికలకు ముందు కొడాలి నాని పరిచయం చేసిన యార్లగడ్డ వెంకట్రావుతో ఈసారి ఎన్నికల్లో ముఖాముఖీ తలపడాల్సి రావడం వీరిద్దరికీ ఇబ్బందికరమే అన్న ప్రచారం కూడా సాగింది. అయితే ఎన్నికల్లో అవేవీ పట్టించుకోకుండా హోరాహోరీ తలపడిన వంశీ, వెంకట్రావు మధ్య ఎన్నికలు ముగిసినా మాటలయుద్ధం ఆగడం లేదు. దీనిపై గన్నవరంతో పాటు కృష్ణాజిల్లాలోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. గతంలో హరికృష్ణ వర్గీయుడిగా కొనసాగిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికీ, గన్నవరం ఎమ్మెల్యే వంశీకి మంచి స్నేహముంది. వీరిద్దరికీ టీడీపీలోనే కలిసి పనిచేసిన చరిత్ర ఉంది. కానీ 2014ఎన్నికలకు ముందు కొడాలి నాని చంద్రబాబుతో విభేదించి టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. అదే సమయంలో కొడాలి నానితో కలిసి ఓదార్పుయాత్రలో పాల్గొంటున్న జగన్ కు వంశీ ఎదురుపడ్డారు. కొడాలి నాని వంశీని జగన్ కు పరిచయం చేశారు. తర్వాత జగన్, వంశీ ఒకరినొకరు పరస్పరం ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇది అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీకి పార్టీలో తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈ ఘటనపై వంశీ స్వయంగా చంద్రబాబుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.


  ఓ దశలో వంశీ వైసీపీలో చేరిపోతారయన్న ప్రచారం కూడా సాగింది. కానీ వంశీ ఇతరత్రా కారణాలతో వెనక్కి తగ్గారు. అయినా తర్వాత కూడా జగన్ ను వంశీ విమర్శించిన దాఖలాలు లేవు. అప్పట్లో కొడాలి నాని పరిచయంతో వంశీకి మద్దతుగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు 2014 ఎన్నికల తర్వాత వైసీపీ గూటికి చేరి గన్నవరం నియోజకవర్గానికి సమన్వయకర్త పదవి దక్కించుకున్నారు. అప్పటి నుంచీ వంశీతో సై అంటే సై అంటూ సాగిన యార్లగడ్డ వెంకట్రావు ప్రస్ధానం... ఈ ఎన్నికల నాటికి వంశీకి హోరాహోరీ పోటీ ఇచ్చే వరకూ సాగింది. ఎన్నికలు ముగిశాక కూడా వంశీ, యార్లగడ్డ వెంకట్రావు మధ్య మాటల యుద్దం కొనసాగుతుండటం జిల్లాలోని ఇరు పార్టీల నేతలకు మింగుడుపడటం లేదు. అయితే దీని వెనుక ఆసక్తికర కారణం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో వంశీ కన్ను వైసీపీమీద పడినట్లు తెలుస్తోంది. గతంలో జగన్ తో ఉన్న పరిచయం, కొడాలి నాని మద్దతు వంటి కారణాలతో వైసీపీలో చేరితే మంత్రి పదవి కూడా దక్కించుకునే ఉద్దేశంతో వంశీ ఉన్నట్లు తెలిసింది.


  అయితే వంశీ వైసీపీలో చేరాలంటే నియోజకవర్గ ఇన్ ఛార్గ్ గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు తెలియకుండా జరగదనేని పార్టీ వర్గాల అంచనా. ఈ కారణంతోనే యార్లగడ్డను వంశీ టార్గెట్ చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలిస్తే సాధ్యమైనంత త్వరగా వైసీపీలో చేరిపోయే ఉద్దేశంతోనే వంశీ యార్లగడ్డను టార్గెట్ చేస్తున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో సాగుతోంది. వంశీ వ్యవహారాన్ని గమనించిన యార్లగడ్డ కూడా అంతే దీటుగా బదులిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పరాకాష్టగా ఏకంగా పార్టీ అధినేత జగన్ ను వల్లభనేని వంశీ దంపతులు బెంగళూరులో కలిసిన విషయాన్ని యార్లగడ్డ బయటపెట్టినట్లు తెలుస్తోంది. తద్వారా జగన్ ను వంశీని దూరం చేయాలన్న ఉద్దేశం యార్లగడ్డ వెంకట్రావుకు ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అదే నిజమైతే జగన్ నిజంగానే యార్లగడ్డ కోసం వంశీని బ్రేక్ వేస్తారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.


  (సయ్యద్ అహ్మద్,న్యూస్ 18 తెలుగు,సీనియర్ కరస్పాండెంట్)

  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, AP News, AP Politics, Chandrababu naidu, Tdp, Vallabhaneni vamsi

  ఉత్తమ కథలు