బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కండువా కప్పుకున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మిలింద్ దేవ్రా, మరో సీనియర్ నేత సంజయ్ నిరుపమ్‌తో కలసి ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఊర్మిళా మటోండ్కర్ ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. 45 ఏళ్ల ఊర్మిళా మటోండ్కర్ చైల్డ్ ఆర్టిస్టుగా బాలీవుడ్ తెరపై కనిపించింది. ఏడేళ్ల వయసులో శశి కపూర్ - రేఖ జంటగా నటించిన కలియుగ్ (1981)లో నటించింది. 1991లో నరసింహతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 1995లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన రంగీలా సినిమా ఆమెను స్టార్ హీరోయిన్గా మార్చేసింది. తెలుగులో కూడా రంగీలా సిల్వర్ స్క్రీన్‌ను ఊపేసింది. ఆ తర్వాత సత్య(1998), పింజర్ (2003), మాసూమ్ లాంటి సినిమాలు ఆమె కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిపోయాయి.
లోక్‌సభ ఎన్నికలకు గ్లామర్ అద్దేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. బీజేపీకి పోటీగా సెలబ్రిటీలను పోటీలో నిలిపేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ తరఫున హేమామాలిని, జయప్రద లాంటి తారలు పోటీ పడుతున్నారు. తాజాగా హర్యానా డ్యాన్సర్ స్వప్న చౌదరిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నం విఫలమైంది. ముంబైలో ఆరు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఓటింగ్ జరగనుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:March 27, 2019, 14:35 IST