UP POLLS SP ANNOUNCE AKHILESH YADAV TO CONTEST UP POLLS FROM KARHAL IN MAINPURI PVN
UP Election : తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పోటీ..ఆ నియోజకవర్గమేనని ప్రకటించిన ఎస్పీ
అఖిలేష్ యాదవ్(ఫైల్ ఫొటో)
AkileshYadav : సస్పెన్స్‌కు తెరపడింది. మెయిన్ పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్నట్టు ఇవాళ సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అఖిలేష్ ప్రస్తుతం అజాంగఢ్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Akilesh Yadav : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. తాజాగా మనసు మార్చుకున్నారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభావం తనపై పడకుండా ఉండేందుకు తాను కూడా పోటీలో ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు అఖిలేష్ యాదవ్ పోటీ కోసం సమాజ్ వాదీ పార్టీ నియోజవర్గాన్ని ఎంపిక చేసింది. అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్‌కు తెరపడింది.
పశ్చిమ యూపీలోని మెయిన్ పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేష్ పోటీ చేయనున్నట్టు ఇవాళ సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా ప్రకటించింది. సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌పాల్ యాదవ్ ఈ ప్రకటన చేశారు. సమాజ్‌వాదీ పార్టీ మెయిన్‌పురి జిల్లా యూనిట్ గురువారం పార్టీ చీఫ్‌కి కర్హల్ స్థానం నుంచి పోటీ చేయాలని లిఖితపూర్వకంగా కోరగా, ఆయన అంగీకరించారని పార్టీ వర్గాలు తెలిపాయి
సమాజ్ వాదీ పార్టీ కంచుకోట అయిన మెయిన్ పురి జిల్లాలో ప్రతీ నియోజకవర్గం ఆ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. మెయిన్ పురి లోక్ సభ స్ధానం నుంచి అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఎంపీగా ఉన్నారు. దీంతో ఇదే నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీటు కర్హాల్ నుంచి తాను బరిలోకి దిగాలని అఖిలేష్ నిర్ణయించుకున్నారు. కర్హాల్ నియోజకవర్గంలో 1.44 లక్షల మంది యాదవ వర్గం ఓట్లు ఉండటంతో అఖిలేష్‌కు ఇది సురక్షితమైన సీటుగా భావిస్తున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పోటీ చేస్తుండటం ఇదే మొదటిసారి. 2012లో ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఎమ్మెల్సీ అయ్యారు. కర్హాల్ లో ఫిబ్రవరి 20న ఓటింగ్ జరగనుంది. అఖిలేష్ ప్రస్తుతం అజాంగఢ్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక,ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కూడా ముందంజలో ఉన్నారు. రైతులకు భరోసాగా నిలుస్తామని, వ్యవసాయ భూముల సేద్యానికి ఉచిత కరెంట్ ఇస్తామని, 22 లక్షల మంది యువతకు ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని అఖిలేష్ హామీలు గుప్పిస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.