UP POLLS KESHAV PRASAD MAURYA GRAPH RISES AS OBC LEADERS QUIT BJP PVN
UP Election : యూపీలో బీజేపీకి ఇప్పుడాయనే దిక్కు..మళ్లీ కీలకంగా కేశవ్ ప్రసాద్ మౌర్య
కేశవ్ ప్రసాద్ మౌర్య
UP BJP : కేశవ్ ప్రసాద్ మౌర్య..ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి తెలిసిన ఎవరికైనా ఈయన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బీజేపీలో కీలకమైన ఓబీసీ నేత. కేశవ్ ప్రసాద్ మౌర్యనే 2017లో యూపీ సీఎం పగ్గాలు చేపడతారని అందరూ భావించారు. అయితే చివరి నిమిషంలో యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి రావడంతో సీఎం పదవిని త్రుటిలో కోల్పోయిన మౌర్య..ప్రస్తుతం యూపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పుడు ఓబీసీల కేంద్రంగా రాజకీయాలు ఊపందుకోవడంతో కౌశవ్ ప్రసాద్ మౌర్య యూపీ బీజేపీలో యోగి కంటే కీలకంగా మారారు.
Kesav Prasad Maurya : కేశవ్ ప్రసాద్ మౌర్య..ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి తెలిసిన ఎవరికైనా ఈయన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బీజేపీలో కీలకమైన ఓబీసీ నేత. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం వెనుక కేశవ్ ప్రసాద్ మౌర్య పాత్ర చాలా ఉంది. గతంలో జవహర్లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఫూల్ పుర్ లోక్‌సభ స్థానం నుంచి 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున మౌర్య విజయం సాధించారు. ఆ తర్వాత యూపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. 403 సీట్లున్న యూపీలో యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళితులను తనవైపునకు తిప్పుకొని బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలిచి..ఆ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. ఈ విజయం వెనుక మౌర్య పాత్ర మరువలేనిది. తన వ్యూహచాతుర్యంతో బీజేపీకి భారీ విజయం దక్కేలా చేయడంలో ప్రధానపాత్ర పోషించిన కేశవ్ ప్రసాద్ మౌర్యనే 2017లో యూపీ సీఎం పగ్గాలు చేపడతారని అందరూ భావించారు. తమ వర్గానికి చెందిన మౌర్య సీఎం అవుతారనే ఆశతో బీజేపీకి ఓబీసీలు ఓట్లేశారని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. అయితే చివరి నిమిషంలో యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి రావడంతో సీఎం పదవిని త్రుటిలో కోల్పోయిన మౌర్య..ప్రస్తుతం యూపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మౌర్య ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. ఇక, ఉప ముఖ్యమంత్రి పదవి దక్కినా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభ ముందు ఇన్నాళ్లూ మసకబారిపోయారు మౌర్య. కాలం మారింది, పరిస్ధితులు తిరగబడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పుడు ఓబీసీల కేంద్రంగా రాజకీయాలు ఊపందుకోవడంతో కౌశవ్ ప్రసాద్ మౌర్య యూపీ బీజేపీలో యోగి కంటే కీలకంగా మారారు.
మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఇప్పటికే పోలింగ్ తేదీలను ఖరారు చేసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయని,ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుందని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల మందు వరకు విజయంపై ధీమా ఉన్న బీజేపీకి..గత వారం యోగి మంత్రివర్గం నుంచి ఓబీసీ నాయకులు స్వామిప్రసాద్ మౌర్య, ధారాసింగ్‌చౌహాన్, ధరమ్‌సింగ్ సైనీలు వైదొలిగి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గూటికి చేరడం పెద్ద తలనొప్పిగా మారింది. ఓబీసీల్లో గట్టి పట్టున్న స్వామిప్రసాద్ మౌర్యను గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఎస్పీ నుంచి తమ పార్టీలోకి చేర్చుకోవడం కాషాయ పార్టీకి అప్పుడు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు స్వామిప్రసాద్ దూరమయ్యారు. తనతోపాటు మరికొందరు కీలక నేతలనూ ఆయన ఎస్పీలోకి తీసుకెళ్లారు. బీజేపీని వీడి ఎస్పీలో చేరిన స్వామిప్రసాద్ మౌర్య సహా ఇతర నేతలందరూ..బీజేపీ సర్కారులో ఓబీసీలకు విలువ లేకుండాపోయిందని విమర్శలు గుప్పించడం వంటి పరిణామాలతో కమళదళం ఉలిక్కిపడింది. బీజేపీ నైతిక స్థయిర్యం కాస్త దెబ్బతింది. అయితే వెంటనే తేరుకొని.. పరిస్థితులు చక్కదిద్దే చర్యలు మొదలుపెట్టింది బీజేపీ. కేశవ్‌ప్రసాద్ మౌర్యకు ప్రాధాన్యం పెంచుతూ.. ఓబీసీలను మచ్చిక చేసుకొనే పని మొదలుపెట్టింది. యూపీలో ఓబీసీ జనాభా 45శాతం ఉంటుందని అంచనా. అందులో ప్రధాన సామాజికవర్గమైన యాదవ్‌లు ఎస్పీకి అండగా ఉన్నారు.
విశ్వహిందూపరిషత్‌తో ప్రారంభమైన కౌశవ్ ప్రసాద్ మౌర్య.. బీజేపీలోకి రావడానికి ప్రయత్నించినప్పుడు అడ్డంకులు ఎదురయ్యాయి. 2004లో మురళీమనోహర్ జోషి అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోయిన తర్వాతనే మౌర్యకి బీజేపీలో ప్రవేశానికి మార్గం సుగమం అయింది. అప్పట్లో అక్కడ జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేసిన కేశవ్‌ప్రసాద్.. మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకు నిరాశే ఎదురైంది. 2012 ఎన్నికల్లో శిరతు స్థానం నుంచి గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు కేశవ్ ప్రసాద్ మౌర్య. 2014 ఎన్నికల్లో ఫూల్పుర్ లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అధిష్ఠానానికి విశ్వాసపాత్రుడు అన్న కారణంతో 2017 యూపీ అసెంబ్లీ ఎన్నకల ముందు మోదీ-అమిత్ షా ఆశీర్వాంతో యూపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. యాదవేతర ఓబీసీలను ఆకర్షించేందుకు బీజేపీకి బాగా ఉపయోగపడ్డారు. తాజా పరిణామాలతో ఇప్పుడు మళ్లీ కేశవ్‌ప్రసాద్‌కు ప్రాధాన్యం పెరిగింది. ప్రచార వేదికలపై ప్రముఖంగా కనిపిస్తున్నారు. చిరునవ్వు, మృదుభాషణ కేశవ్‌ప్రసాద్ సహజ లక్షణాలు. అంతగా ఉద్వేగాలకు లోనుకారు. పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండటం, అధిష్ఠానానికి విశ్వాసపాత్రుడు కావడం సానుకూలాంశాలు. స్వపక్ష నేతలతోపాటు మిత్రపక్షాలైన అప్నాదళ్, నిషాద్ పార్టీలతోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయి.
ఇక,.యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 107 మంది అభ్యర్థులతో తొలి జాబితాను గత శనివారం విడుదల చేసింది. విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఓబీసీ నాయకులకు పెద్దపీట వేసింది. ప్రకటించిన అభ్యర్థుల్లో 44 మంది ఓబీసీలు ఉండటం విశేషం. తొలి జాబితాలోనే కేశవ్‌ప్రసాద్ పేరు కూడా ఉంది. తను పట్టిన ప్రాంతమైన శిరతు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కౌశవ్ ప్రాదవ్ బరలోకి దిగుతున్నారు. ప్రస్తుతం శిరతు ఎమ్మెల్యేగా బీజేపీకి చెందిన శీత్లా ప్రాద్ ఉన్నారు. శుక్రవారం(జనవరి-21) మరో 85 స్థానాలకు అభ్యర్థులను ఖారారు చేస్తూ రెండో లిస్ట్ ను బీజేపీ రిలీజ్ చేసింది. ఇందులో 30 మంది ఓబీసీ అభ్యర్థులున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.