Home /News /politics /

UP POLLS IS MAYAWATI MUTED CAMPAIGN PART OF SOME GRANDER DESIGN PVN

UP Polls : మాయావతి మౌనానికి కారణం అదేనా! మాయ మౌనంతో లాభం వారికేనా!

బీఎస్పీ అధినేత్రి మాయావతి (File)

బీఎస్పీ అధినేత్రి మాయావతి (File)

mayawati silence : మాయావతిలో ఏర్పడ్డ ఈ స్తబ్దత.. వ్యూహరచనలో భాగమా? లేక తన అంతాన్ని తానే లిఖించుకుంటున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మాయావతి మౌనంపై స్పష్టమైన సమాధానం లేనప్పటికీ, ఖచ్చితమైన సూచనలు ఉన్నాయి.

Uttar Pradesh Assembly Elections :  మరికొద్ది రోజుల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు ఈసారి ఆసక్తికర పరిణామాల దిశగా సాగుతున్నాయి. యూపీలో మళ్లీ అధికారం చేజిక్కుంచుకుని మరోసారి తమ ఢిల్లీ పీఠానికి తిరుగులేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీకి సమాజ్‌వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వాస్తవానికి ప్రతి ఎన్నికల్లోనూ బహుముఖ పోరు సాగే యూపీలో ఈసారి రెండు పార్టీల మధ్య ముఖాముఖి పోటీ జరుగుతుందన్నట్లుగా రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ప్రధాని మోదీ నుంచి రాష్ట్ర బీజేపీ నేతల దాకా ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రచార సభల్లో అఖిలేష్ యాదవ్ నే లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు యూపీ రాజకీయమంతా అఖిలేష్ చుట్టూనే తిరుగుతోంది. బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్తబ్దుగా ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు. అనేక సర్వేలు ఇప్పటికే మాయావతి ఎన్నికల రేసులో లేరని తీర్మానించాయి. యూపీతో సహా దేశ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన, అభిమానులు బెహన్‌జీ అని ఆప్యాయంగా పిలుచుకొనే మాయావతి శక్తిసామర్థ్యాలు ఇప్పుడు గతమెంతో ఘనకీర్తి అన్నచందంగా మారింది. ఒకప్పుడు ఎవరి ఊహకి అందని విధంగా యూపీ ప్రజల్ని మాయ చేశారు మాయావతి. రాజసంతో యూపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బీఎస్పీ అధ్యక్షురాలు అగ్రవర్ణాలు, దళితులు అనే సోషల్‌ ఇంజనీరింగ్‌ వ్యూహంతో ఎన్నికల్లో కాకలు తీరిన యోధులకే కొత్త పాఠాలు నేర్పించారు. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సూత్రాన్ని వంటబట్టించుకున్న ఆమె ఆప్త మిత్రులనైనా పక్కన పడేయగలరు. ఆగర్భ శత్రువులతోనైనా చేయి కలపగలరు. రాజకీయంగా అత్యంత అనుభవజ్ఞురాలు, అత్యంత శక్తిమంతమైన మహిళగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నాయకురాలు, ఒకప్పుడు ప్రధాని పదవికి సైతం పోటీదారుగా నిలువాలని ఆశించిన మాయావతి.. ఈసారి కీలక సమయంలో మౌనం దాల్చడం వెనుక ఎలాంటి మాయ దాగుందోనన్న చర్చ జరుగుతోంది.

కొన్నేళ్లుగా, మాయావతి (బెహెన్‌జీ) యొక్క దూకుడు, వ్యూహప్రతివ్యూహాలు మరియు ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు లేకుండా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగిందే లేదు. హైఓల్టేజ్ ప్రచారాలతో యూపీ ఓటర్లనే కాకుండా యావత్ దేశం తనవైపు తిప్పుకునేలా చేసేది మాయావతి. ఈసారి ఎన్నికల్లో మాయావతి పార్టీ పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలోనూ, మ్యానిఫెస్టో విడుదలలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ ఎందులోనూ స్పీడ్‌ కనిపించడం లేదు. అధికార బీజేపీతోపాటు ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ప్రియాంకాగాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటినుంచో ఎన్నికలకు సిద్ధమై జనంలోకి వెళ్తుండగా.. మాయావతి మాత్రం ఇప్పటిదాకా అటువంటి ప్రయత్నాలేమీ చేయలేదు. అడపాదడపా మీడియా సమావేశాల్లో,ట్విట్టర్ లో తప్పా యామావతి ఎక్కడా కనిపించడంలేదు. యూపీలో ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీ మధ్య సాగుతూ ఎన్నికల కాక రగులుతూ ఉంటే మాయావతి వ్యూహాలేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. తన పార్టీ నుంచి అగ్రనేతలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వలస వెళుతున్నా ఆమె మౌనం పాటిస్తుండడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. మాయావతి మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. మాయావతిలో ఏర్పడ్డ ఈ స్తబ్దత.. వ్యూహరచనలో భాగమా? లేక తన అంతాన్ని తానే లిఖించుకుంటున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే మాయావతి మౌనంపై స్పష్టమైన సమాధానం లేనప్పటికీ, ఖచ్చితమైన సూచనలు ఉన్నాయి. ఆమె బీజేపీతో కలిసి బీజేపీ-బీ టీమ్ గా పనిచేస్తోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆమె ఎదుర్కొంటున్న కేసులని విశ్లేషకులు చెబుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఆరోపణలు,తాజ్‌ హెరిటేజ్‌ కారిడార్‌లో అవకతవకలు వంటి ఆరోపణలు, సీబీఐ నమోదు చేసిన కేసులు మాయావతి వర్తమానంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. చాలా కేసుల్లో ఆమె క్లియర్ అయినప్పటికీ అనుమానపు కత్తి ఇప్పటికీ ఆమె తలపై వేలాడుతూనే ఉంది. కేసుల క్లియరెన్స్‌ లు సాంకేతికతపై ఆధారపడి ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. అవి ఎప్పుడూ చెడు పీడకలలా మళ్లీ తెరమీదకొస్తాయని అంటున్నారు. ఆ అంశమే ఆమెను అశాంతికి గురిచేసి బీజేపీకి లొంగిపోయేలా చేసినట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ALSO READ డోన్ట్ అనౌన్స్ ఎగ్జిట్ పోల్స్..ఎప్పటి వరకో తెలుసా..

ఢిల్లీలోని నిరుపేద దళిత కుటుంబంలో 1956 సంవత్సరం జనవరి 15న జన్మించిన మాయావతి తొలుత ఐఏఎస్‌ కావాలని కలలు కన్నారు. 1977– 1984 మధ్య కాలంలో ఢిల్లీ స్కూల్లో టీచర్‌గా చేశారు మాయావతి. దళిత నాయకుడు కాన్షీరామ్‌ తో 1977లో మాయావతికి పరిచయం ఏర్పడింది. కాన్షీరామ్‌ 1984లో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (BSP) స్థాపించి మాయావతిని కూడా పార్టీలోకి తీసుకున్నారు. రాజకీయ రంగప్రవేశంతో ఆమె జీవితమే మారిపోయింది. ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. మాయావతికి మొదట్లో అపజయాలే ఎదురయ్యాయి. 1985లో తొలిసారి లోక్‌సభకు పోటీపడినప్పుడు ఆమె ఓడిపోయారు. 1987లో మళ్లీ ఓటమిపాలయ్యారు. 1989లో యూపీ శాసనమండలికి ఎన్నికయ్యారు. కాన్షీరామ్‌ అనారోగ్యం బారినపడడంతో 1995లో బీఎస్పీ పగ్గాలు చేపట్టారు. తొలిసారిగా 1995 సంవత్సరం నాలుగు నెలల పాటు యూపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక దళిత మహిళ అత్యున్నత స్థాయి పదవిని అందుకోవడం అదే తొలిసారి. ఆ తర్వాత మరో రెండు సార్లు స్వల్పకాలం సీఎంగా కొనసాగారు. 1997లో ఆరు నెలలు, 2002–03లో 17 నెలలు సీఎం పదవిలో ఉన్నారు. . 2007లో 30.43 శాతం ఓట్లు, 206 సీట్లతో పూర్తి మెజారిటీతో అధికారం అందుకున్నారు. అద్భుతమైన సామాజిక సమీకరణల ద్వారా బ్రాహ్మణులు, యాదవేతర ఓబీసీలు, ముస్లింలను తమ పార్టీ వైపునకు తిప్పుకొని రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపర్యారు. పూర్తిగా అయిదు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగారు. ఈ అయిదేళ్ల కాలంలో ఆమె ప్రభ మసకబారడం ప్రారంభించింది. అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులు, అధికారాన్ని ఉపయోగించుకొని బల ప్రదర్శన, డజనుకు పైగా విమానాలు, హెలికాప్టర్లను ప్రచారానికి వినియోగించడం, తాజ్‌ హెరిటేజ్‌ కారిడార్‌లో అవకతవకలు వంటివెన్నో వివాదాస్పదమయ్యాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన విగ్రహాలు, పార్టీ చిహ్నం ఏనుగు విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టించడం, పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా చేసుకోవడం, కార్యకర్తలు వేసే కరెన్సీ దండల్ని స్వీకరించడం, పాలనా వైఫల్యాలు వంటివన్నీ ఆమెపై తీవ్ర వ్యతిరేక భావాన్ని పెంచాయి. నిమ్నకులాలకి చేసిందేమిటన్న ప్రశ్నలు వచ్చాయి. ఆ తరువాత 2012లో బీఎస్పీ 25.91 శాతం ఓట్లకు పడిపోయినప్పటికీ రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచి బీజేపీని మూడో స్థానానికి నెట్టి వేసింది. అయితే 2017లో పరిస్థితి ఇంకా దిగజారిపోయి 22.2 శాతం ఓట్లతో మూడోస్థానానికి పడిపోయింది. 2017 శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం 19 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో కలిసి పోటీ చేసినప్పటికీ మాయావతి ఎక్కువ సీట్లు, ఓట్లతో రెండో స్థానం పొందారు. ప్రస్తుత ఎన్నికల్లో కనీసం ఓట్ల శాతాన్ని నిలబెట్టుకునేందుకైనా బలమైన కృషి చేస్తున్నట్లు కనిపించకపోవడంతో బీఎస్పీ ఉనికిపై సందేహాలు తలెత్తుతున్నాయి.

మాయావతి మౌన క్యాంపెయిన్ నేపథ్యంలో బీఎస్పీ ఓటుబ్యాంకు ఎవరికి లాభిస్తుందన్న చర్చ కూడా మొదలైంది. బీఎస్పీ ఓటుబ్యాంకు ఈ ఎన్నికల్లో కీలకపాత్రే పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దళితుల ఓటుబ్యాంకు బలంగా ఉన్న బీఎస్పీ.. గతంలో దళితులు-బ్రాహ్మణులను ఏకం చేసి ఒంటరిగా అధికారాన్ని కూడా చేపట్టింది. అయితే అధికశాతం బ్రాహ్మణులు మొదటినుంచీ బీజేపీ వెంటే ఉంటూ వస్తున్న నేపథ్యంలో బీఎస్పీ అనుకూలురైన బ్రాహ్మణులు ఇప్పుడు తమవైపునకు వస్తారని కమలనాథులు భావిస్తున్నారు. కానీ, ప్రియాంకాగాంధీ నేతృత్వంలో యూపీలో కాంగ్రెస్‌ క్రియాశీలంగా మారడంతో బ్రాహ్మణుల్లో చీలిక రావచ్చని, బీజేపీతోపాటు కాంగ్రెస్‌ వైపు కూడా మొగ్గుచూపవచ్చనే అంచనా ఉంది. బీఎస్పీ ఓటుబ్యాంకు అయిన దళితుల ఓట్లను కాంగ్రెస్‌ ఏ మేరకు చీలుస్తుందన్నది కూడా ప్రధానం కానుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ ఎంత ఎక్కువగా దళితుల ఓట్లను చీలిస్తే.. అఖిలేశ్‌ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ(SP)కి అంత నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు ముస్లింలు కూడా బీఎస్పీ నుంచి ఎటువైపు మొగ్గుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ALSO READ ADR Report : ఆస్తుల్లో బీజేపీనే బాద్ షా..ప్రాంతీయ పార్టీల్లో అవే రిచ్చెస్ట్

ఇక, శుక్రవారం నాలుగో దశ ఎన్నికలకు సంబంధించి బీఎస్పీ అభ్యర్థుల జాబితాను మాయావతి ప్రకటిచింది. ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగో దశ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను పాటించారు మాయావతి. మాయావతి.. నాలుగో దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మొత్తం 60 స్థానాలకు గాను శుక్రవారం 53 అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో దళిత వర్గాల అభ్యర్థులు 14 మంది, ఇతర వెనుకబడిన కులాలు (OBCలు) 11 మంది, అగ్రవర్ణాల 13 మంది మరియు 15 మంది ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారు. మిగిలిన ఏడు స్థానాల్లో అభ్యర్థులను తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపారు. 51 మంది అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించిన సంద‌ర్బంగా మాయావతి మాట్లాడుతూ.. ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం ప్ర‌తీ ఒక్క కార్య‌క‌ర్త క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని పిలుపు నిచ్చారు. 2007లో గెలిచిన విధంగా మ‌రోసాని బీఎస్పీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌ని ఆశిస్తున్నామ‌న్నారు. హ‌ర్ పోలింగ్ బూత్ కో జితానా హై.. బీఎస్పీకో స‌త్తామే లానా హై అనే నినాదం కూడా ఇచ్చారు మాయావ‌తి.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీలో మొత్తం 403 సీట్లు ఉన్నాయి. దేశంలోనే అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నయూపీలో ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ నుంచి ఎన్నిక‌లు జ‌రగుతాయి. మొత్తం ఏడుద‌శల్లో ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. మొద‌టి ద‌శ ఫిబ్ర‌వ‌రి- 10, రెండో ద‌శ ఫిబ్ర‌వ‌రి - 14, మూడో ద‌శ ఫిబ్ర‌వ‌రి - 20, నాలుగో ద‌శ ఫిబ్ర‌వ‌రి -23, ఐదో ద‌శ -27, ఆరో ద‌శ మ‌ర్చి -3, ఏడో ద‌శ మార్చి -7వ తేదీన జ‌ర‌గనున్నాయి. మార్చి 10వ తేదీన ఎన్నిక‌ల కౌంటింగ్ నిర్వ‌హిస్తారు. ఫ‌లితాలు అదే రోజు ప్ర‌క‌టిస్తారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bjp, Bsp, Mayawati, Sp-bsp, UP Assembly Elections 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు