UP ASSEMBLY ELECTIONS 2022 CAMPAIGNING MLA REQUESTS MAN WHILE HE IS BATHING TO VOTE FOR BJP SK
UP Elections: నీ ఓటు నాకే.. స్నానం చేస్తున్నప్పుడు కూడా వదలారా? ఎమ్మెల్యే ప్రచారం..వైరల్ వీడియో
స్నానం చేస్తున్న వ్యక్తితో ఎమ్మెల్యే ప్రచారం
UP Assembly Elections 2022: ఇంట్లో స్నానం చేస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి మరీ బీజేపీ ఎమ్మెల్యే ప్రచారం చేశారు. ఒంటికి సబ్బు రుద్దుకుంటున్న సమయంలో ఎమ్మెల్యే ఇంట్రీ ఇవ్వడంతో ఆయన షాక్ తిన్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
యూపీలో ఎన్నికల (UP Assembly Elections 2022) కోలాహలం నెలకొంది. ఎన్నికల ప్రచారం వేడెక్కడడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. అన్ని పార్టీల నేతలు ప్రజల్లో తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో నేతల పాట్లు అన్నీ ఇన్నీ కావు. గ్రామాల్లో కలియ తిరుగుతూ..ఇంటింటికీ వెళ్లూ.. ఓటర్లను కలుస్తారు. మీ ఓటు మాకే వేయాలని అడుగుతారు. ప్రచారం కోసం నానా తిప్పలు పడతారు. టీ స్టాల్లో ఛాయ్ పెడతారు. టిఫిన్ సెంటర్లో దోసెలు వేస్తారు. బట్టలు ఇస్త్రీ చేస్తారు. పలుగు పార చేతపడతారు. అబ్బో.. ఒక్కటా రెండా ఎన్నో చిత్ర విచిత్రాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి సీనే కనిపిస్తోంది.
ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఓ ఎమ్మెల్యే కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంట్లో స్నానం చేస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి మరీ ప్రచారం నిర్వహించారు. కాన్పూర్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైథానీ గురువారం తన నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఓ ఇంటి లోపలికి వెళ్లి.. స్నానం చేస్తున్న వ్యక్తితో మాట్లాడారు. ఒంటికి సబ్బు రుద్దుకుంటున్న సమయంలో ఎమ్మెల్యే ఇంట్రీ ఇవ్వడంతో ఆయన షాక్ తిన్నాడు. ముఖం కడుక్కొని ఎమ్మెల్యేతో మాట్లాడాడు. ఏమయ్యా బాగున్నావా.. ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇల్లు పూర్తయిందా? రేషన్ కార్డు ఉందా..? అని ఎమ్మెల్యే ఆరా తీయడంతో.. ఉంది సార్.. అని ఆయన సమాధానం ఇచ్చారు. పాంఫ్లెట్ ఆయన చేతికి ఇచ్చి.. ఈసారి నీ ఓటు మాకే వెయ్యాలని ఎమ్మెల్యే సురేంద్ర మైథాని అభ్యర్థించారు. ఆ ఫొటోను స్వయంగా తన ఇన్‌స్టగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
“గృహపథకం కింద ఇంటిని నిర్మించుకున్న ఓ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపాను. ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరాను" అని ఆ ఎమ్మెల్యే తన ఇన్‌స్టగ్రామ్‌లో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సురేంద్ర మైథానీ స్నానం చేస్తున్న వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కనీసం స్నానం చేసేటప్పుడు కూడా వదిలిపెట్టరా? అని సెటైర్లు వేస్తున్నారు.
యూపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధానంగా బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో రాజకీయాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ముగ్గురు మంత్రులు సహా మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీని వీడారు. వారంతా సమాజ్‌వాదీ పార్టీలో చేరనున్నారు. ఐతే బీజేపీ మాత్రం ఇంకోలా స్పందిస్తోంది. వారి పనితీరు బాలేనందున హైకమాండ్ టికెట్లను నిరాకరిచిందని.. ఆ కారణం వల్లే పార్టీని వీడారని చెబుతోంది.
మరోవైపు ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కూడా రేస్‌లో ఉంది. ఇప్పటికే 125 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ కూడా అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. అతి త్వరలోనే జాబితాను ప్రకటించనుంది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 1 వరకు.. మొత్తం ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలను వెల్లడిస్తారు
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.