Free Electricity: 24 గంటలూ ఉచిత విద్యుత్... పాత బిల్లులన్నీ మాఫీ.. ప్రజలపై వరాల జల్లు

ప్రతీకాత్మకచిత్రం

యూపీలో ఆమాద్మీ పార్టీ అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు ప్రతి నెలా 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా పంపిణీ చేస్తామని మనీశ్ సిసోడియా ప్రకటించారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలిపారు

 • Share this:
  ఎన్నికల వేళ ప్రజలపై వరాల జల్లులు కురవడం సర్వ సాధారణం. అన్ని పార్టీలూ ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంటాయి. కొత్త కొత్త పథకాలను ప్రకటిస్తాయి. రైతుల రుణమాఫీ నుంచి మొదలుకొని.. ఎన్నో హామీలను గుప్పిస్తాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది.  యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (UP Assembly Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేయడంతో పాటు ప్రజలను ఆకర్షించేందుకు పక్కాగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఐతే ఈసారి ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, ఎస్పీ, బీఎస్పీలాగే ఆమాద్మీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.

  గురువారం లక్నోలో పర్యటించిన ఆమాద్మీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. యూపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు ప్రతి నెలా 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలిపారు. అంతేకాదు 38 లక్షల కుటుంబాల విద్యుత్‌ బకాయి బిల్లులు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయానికి కూడా ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు సిసోడియా. యూపీలో విద్యుత్‌ ఛార్జీలు అధికంగా ఉన్నాయని.. పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వాపోయారు. బీజేపీ ప్రభుత్వం 300 యూనిట్లకు రూ.1900 బిల్లు వేస్తోందని.. ఆమాదీ ప్రభుత్వంలో రూపాయి కూడా కట్టాల్సిన అవసరం ఉండదని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఉచిత విద్యుత్‌ హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు మనీశ్ సిసోడియా.  Corona Diagnose Mask: ఈ మాస్క్ 90 నిమిషాల్లో కోవిడ్ ను కనిపెడుతుందట.. వివరాలిలా..

  అధిక విద్యుత్‌ బిల్లు కారణంగా అలీగఢ్‌లో రామ్‌జీ లాల్‌ అనే రైతు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనీశ్ సిసోడియా గుర్తుచేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లులు ప్రజలకు తలకు మించిన భారం అవుతోందని.. బిల్లులు కట్టనివారిని నేరస్థులుగా పరిగణిస్తున్నారని బీజేపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. విద్యుత్‌ అనేది విలాసవంతమైనది కాదని.. అది కనీస అవసరమని మనీశ్ సిసోడియా తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆమాద్మీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పిందే చేస్తారని ఆ పార్టీ ఎంపీ, యూపీ ఇన్‌ఛార్జి సంజయ్‌ సింగ్‌ తెలిపారు. ఉచిత విద్యుత్‌ను కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు.

  Viral News: ఇద్దరు విద్యార్థుల అకౌంట్లలో రూ.960 కోట్లు జమ.. షాక్ అయిన  స్థానికులు

  ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే అధికారంలో ఉన్న ఆమాద్మీ పార్టీ.. ఇతర రాష్ట్రాల్లోనూ సత్తాచాటాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక దృష్టిసారించారు. పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యూపీతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవాలో కూడా ఇదే రకమైన హామీలు, పథకాలను ప్రకటిస్తూ సంచలనాలకు తెరదీస్తోంది.
  Published by:Shiva Kumar Addula
  First published: