Unnao Rape Case : ఉనావ్ రేప్ కేసులో కీలక మలుపు.. ఎమ్మెల్యే కుల్దీప్‌ను బహిష్కరించిన బీజేపీ

బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్

Unnao Rape Case : కేసును తమ ఆధీనంలోకి తీసుకున్న సీబీఐ ఏడు రోజుల్లోగా దీనిపై విచారణ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించిన మరో ఐదు కేసులను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది.

  • Share this:
    ఉనావ్ గ్యాంగ్ రేప్ ఘటన కీలక మలుపు తీసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుండటంతో ఆ పార్టీ ఎట్టకేలకు అతనిపై చర్యలు తీసుకుంది. కుల్దీప్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. మంగళవారం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ.. ఇప్పుడు శాశ్వతంగా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే కేసుకు సంబంధించి తాజాగా సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేసును తమ ఆధీనంలోకి తీసుకున్న సీబీఐ ఏడు రోజుల్లోగా దీనిపై విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించిన మరో ఐదు కేసులను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేత్రుత్వంలోని బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. కోర్టులో విచారణ సందర్భంగా మొదట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను విచారణకు ఎన్ని రోజుల సమయం కావాలని సుప్రీం ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ నెల రోజుల గడువు కావాలని తుషార్ చెప్పారు. అయితే సుప్రీం మాత్రం అన్ని రోజుల గడువు కుదరదని.. ఏడు రోజుల్లోగా విచారణ పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.

    కాగా, గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఉనావ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేయాల్సిందిపోయి..బాలిక తండ్రిని తీసుకెళ్లి తమ ప్రతాపం చూపించారు. దీంతో బాలిక తండ్రి మృతి చెందాడు. న్యాయం కోసం బాధితురాలు సీఎం కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు కూడా యత్నించింది. కేసుపై విచారణ జరుగుతున్న క్రమంలోనే.. ఇటీవల బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో కుల్దీప్ సింగే ఈ యాక్సిడెంట్ చేయించాడన్న అనుమానాలు బలపడ్డాయి. ప్రమాదంలో బాధితురాలి తల్లి,అత్త మరణించగా.. ఆమె,ఆమె తరుపు న్యాయవాది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
    First published: