ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు.. మరోసారి కుండబద్దలు కొట్టిన పువ్వాడ

TSRTC STRIKE : రాష్ట్రం ఏర్పడేనాటికి ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4416కోట్లు అని.. కొంతమంది తప్పుడు లెక్కలతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులను కాజేయాలని కుట్ర పన్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.

news18-telugu
Updated: October 12, 2019, 1:17 PM IST
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు.. మరోసారి కుండబద్దలు కొట్టిన పువ్వాడ
పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్ ఫొటో)
  • Share this:
టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో గానీ.. ఎన్నికల హామీల్లో గానీ ఏనాడు ఆర్టీసీ విలీనం గురించి చెప్పలేదని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. దసరా పండుగ వేళ ప్రజలకు అసౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక అసమ్మతమైన సమ్మెను ప్రజలపై రుద్దాలని యూనియన్లు ప్రయత్నించాయని ఆరోపించారు. అయితే వారి చర్యలను ప్రభుత్వం,ఆర్టీసీ యాజమాన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచనే లేదని మరోసారి స్పష్టం చేశారు. నిజానికి చర్చల నుంచి ఏకపక్షంగా వెళ్లిపోయింది కార్మిక నాయకులేనని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ,ప్రైవేట్ బస్సులు అన్నీ కలుపుకుని 7358 బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు.

బీజేపీ,కాంగ్రెస్,వామపక్షాలకు ఈ సందర్భంగా మంత్రి అజయ్ పలు ప్రశ్నలు సంధించారు.బీజేపీ,కాంగ్రెస్,వామపక్షాలు గతంలో పాలించిన రాష్ట్రాల్లో గానీ..ఇప్పుడు పాలిస్తున్న రాష్ట్రాల్లో గానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని గుర్తించి బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. దేశంలో రైల్వేనే ప్రైవేటీకరించిన బీజేపీ.. రాష్ట్రంలో మాత్రం ఆర్టీసీ ప్రభుత్వ విలీనంపై మాట్లాడటం సబబు కాదన్నారు.గతంలో ఆర్టీసీ ఎన్నడూ లాభాల్లో లేదని.. కేసీఆర్ రవాణా మంత్రిగా పనిచేసినప్పుడు మాత్రమే ఆర్టీసీ రూ.14కోట్ల లాభంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఆర్టీసీ లాభాల్లో కొనసాగాలంటే.. 50శాతం ప్రభుత్వ బస్సులు,30శాతం హైరింగ్,20శాతం రూట్ పర్మిషన్ బస్సులను నడపాలని నిర్ణయించినట్టు తెలిపారు. అంతే తప్ప ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదన్నారు.ఆర్టీసీ ఉండాలని కేసీఆర్ ఇదివరకే కుండబద్దలు కొట్టారని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులు కేవలం 20శాతం ఫిట్‌మెంట్ అడిగితే 44శాతం ఫిట్‌మెంట్ కేసీఆర్ ఇచ్చారన్నారు. ఇటీవలే ఐఆర్ కూడా ఇచ్చారని గుర్తుచేశారు.

పక్క రాష్ట్రం వాళ్లు చేసినంత మాత్రానా తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిన పనిలేదన్నారు. పక్కనోడు తొడ కోసుకున్నాడని మేము మెడ కోసుకోమన్నారు.ఇక్కడ అమలవుతున్న రైతు బంధు,రైతు భీమా అక్కడ అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4416కోట్లు అని.. కొంతమంది తప్పుడు లెక్కలతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులను కాజేయాలని కుట్ర పన్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలో పాల్గొన్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బస్ సర్వీసులు అందించినందుకు.. ప్రభుత్వం,అందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading