హుజూరాబాద్‌లో ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరిని కొనుగోలు చేయాలి అని మాత్రమే సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులను పంపించి మరి యాక్టివ్‌గా ఉన్న నాయకుల లిస్ట్ తయారు చేస్తున్నారని విమర్శించారు. ఈ పని తప్ప కేసీఆర్ ఇంకేమీ చేయడం లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్‌లో ఆయన పర్యటించారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని... ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్లు సైతం ఓడిపోయారని అన్నారు. డబ్బులు శాశ్వతం కాదన్న కిషన్ రెడ్డి.. ప్రజలు నిర్ణయం తీసుకుంటే.. ప్రజలు మార్పు రావాలని కోరుకుంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఎన్నికల్లో గెలవలేరని టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. చాలామంది ఈటల రాజేందర్ రాజీనామా వల్లే ఈ పథకాలు వచ్చాయని అనుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే ఈ పథకాలు మాకు కూడా వస్తాయని అని భావిస్తున్నారని తెలిపారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈటల రాజేందర్ ఒక్కరి ఎన్నిక కాదని... ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఎన్నిక అని కిషన్ రెడ్డి అన్నారు. తాను ఎన్నికల అప్పుడు వస్తానని.. అప్పుడు ఊరు ఊరు తిరుగుతానని అన్నారు. ఈట రాజేందర్ ఒంటరి కాదని.. ఆయన వెనుక సైన్యం ఉందని అన్నారు. లక్షలాది మంది ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు. నాన్నని అడ్డుపెట్టుకుని, మామని అడ్డుపెట్టుకొని రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. విద్యార్థి దశ నుంచి పోరాడి రాజకీయాల్లోకి వచ్చామని గుర్తు చేశారు.
ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయని దిగజారిన రాజకీయానికి కేసీఆర్ దిగుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఆ మార్పు హుజురాబాద్ నుంచే మొదలు కాబోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు మీ ఓటు మీద ఆధారపడి ఉందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి మీద అప్పు ఉందని.. చేసిన అప్పు డబ్బులన్నీ స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.