UNION MINISTER KISHAN REDDY SLAMS TELANGANA CM KCR OVER PADDY CROP AND FARMERS ISSUES MKS
cm kcr ఢిల్లీ పర్యటనపై కేంద్ర మంత్రి kishan reddy సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రైతుల అంశాలే ప్రధానంగా ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పిన సీఎం కేసీఆర్.. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ కేంద్ర మంత్రి ఏమీ చేయడం లేదన్న ఆరోపణలకు కిషన్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. అసలు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లాడో గుట్టు విప్పారు..
ధాన్యం కొనుగోలు, నీటి వాటాల కేటాయింపులు, విభజన హామీల.. ఇలా ప్రతి అంశంలో తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నదని ఆరోపిస్తూ, ఇక తాడో పేడో ఢిల్లీ పర్యటనలోనే తేల్చుకుంటానంటూ సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన కామెంట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రైతుల అంశాలే ప్రధానంగా ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పిన కేసీఆర్.. ధాన్యం (paddy) కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి ఏమీ చేయడం లేదన్న ఆరోపణలకు కూడా కిషన్ రెడ్డి బదులిచ్చారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ పై పలు సంచలన కామెంట్లు చేశారు. ఉత్తరాది రైతులకు పరిహారం ప్రకటించిన కేసీఆర్.. తెలంగాణ అమరులు, రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఎందుకు ఆదుకోరంటూ విమర్శలు వెల్లువెత్తుతోన్న తరుణం దాదాపు అలాంటి ప్రశ్రాస్త్రాన్నే కేసీఆర్ కు సంధించారు కిషన్ రెడ్డి.
రైతాంగానికి సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని, అసలు సమస్య అంతా టీఆర్ఎస్ పునాదుల్లోనే ఉందని, పార్టీ పునాదులు కదులుతున్నాయని అర్థమైన తర్వాతే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప పోరులో కేసీఆర్ కుటుంబం అన్ని శక్తులు ధారపోసినా, జనం బీజేపీని గెలిపించారని, ఆ దెబ్బకు టీఆర్ఎస్ పునాదులు కుదిలిపోయాయని, హుజూరాబాద్ ఫలితం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రైతుల పేరుతో కేసీఆర్ నాటకాలు మొదలు పెట్టాడని, నిజానికి ఆయన ప్రయత్నం కేవలం పార్టీని బతికించుకోడానికేనని కిషన్ రెడ్డి అన్నారు.
పార్టీని బతికించుకోడానికి ఒక ముఖ్యమంత్రి స్వయంగా ధర్నాకు దిగడం మొదటిసారి చూశానని కిషన్ రెడ్డి అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేంద్రంపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటంతో ఎంఎంటీఎస్ పనులు నిలిచిపోయాయన్నారు. దళితుడు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ అభివృద్ధి జరగదనే విధంగా సీఎం మాట్లాడడాన్ని ఖండిస్తున్నానన్నారు. దళితులకు సీఎం అయ్యే అర్హతపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని కిషన్ రెడ్డి సవాలు చేశారు.
రాజకీయ లబ్ధి కోసం లేని సమస్యను సృష్టించి సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులను ఆగం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గడిచిన ఏడేళ్ళుగా తెలంగాణతో ఒప్పందం మేరకు ప్రతి ధాన్యం గింజను కేంద్రమే కొంటోందన్నారు. బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ విలేజ్‌గా పోచంపల్లి గ్రామాన్ని కేంద్రం ఎంపిక చేసిందన్నారు. అంబేద్కర్ వర్థంతి డిసెంబరు 6న విద్యార్థుల స్కాలర్ షిప్స్‌ను జమ చేస్తామన్నారు. సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకాలు నవ తరానికి తెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.