Home /News /politics /

UNION CABINET EXPANSION ON THE CARDS 27 NEW FACES IN MODI CABINET MINISTERS LIST ACCORDING TO SOURCES SK

Cabinet expansion: మోదీ కేబినెట్‌లోకి 27 మంది కొత్త మంత్రులు? లిస్ట్‌లో ఉన్నది వీళ్లే..

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

Cabinet expansion: కేబినెట్‌లో మార్పులు చేర్పులపై చర్చలు తుది దశకు చేరినట్లు తెలిసింది. భారీ స్థాయిలో మార్పు ఉండే అవకాశముంది. ఏకంగా 27 మంది కొత్త వారిని కేబినెట్‌లోకి తీసుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నారట.

  కేంద్రమంత్రివర్గ విస్తరణపై కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కొత్త వారిని కేబినెట్‌లోకి తీసుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేబినెట్‌లో మార్పులు చేర్పులపై బీజేపీ పెద్దలతో ప్రధాని మోదీ చర్చలు తుది దశకు చేరినట్లు తెలిసింది. ఈసారి భారీ స్థాయిలో మార్పు ఉండే అవకాశముంది. ఏకంగా 27 మంది కొత్త వారిని కేబినెట్‌లోకి తీసుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నారట. ఈ జాబితాలో రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్), బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, బీజేపీ ప్రధాన కార్యదర్శులు భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్), కైలాస్ విజయవార్గీయ (మధ్యప్రదేశ్), అసోెం మాజీ సీఎం సర్వానంద సోనోవాల్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే, మహారాష్ట్రలోని బీఢ్ ఎంపీ ప్రీతమ్ ముండే ఉన్నారు.

  ఇక వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న యూపీలో చాలా మంది నేతలకు కేంద్రమంత్రి పదవులు వచ్చే అవకాశముంది. బీజేపీ అధికార ప్రతినిధి, మైనారిటీ నేత సయ్యద్ జాఫర్ ఇస్లామ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ జైన్, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్ సింగ్, ఎంపీలు వరుణ్ గాంధీ, పంకజ్ చౌదరి, బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్‌ మోదీ కేబినెట్‌లో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒడిశా నుంచి కూడా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎంపీలు అశ్విని వైష్ణవ్, బైజయంత పాండకు ఈసారి కేంద్రమంత్రి పదవులు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. మోదీ గత ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన పాలి ఎంపీ పీపీ చౌధరి, చురు ఎంపీ రాహుల్ కస్వాన్, సికార్ ఎంపీ సుమేధానంద్ సరస్వతతో పాటు మరికొందరు నేతలు ఉన్నారు. రైల్వే శాఖ మాజీమంత్రి దినేష్ త్రివేదికి కూడా ఈసారి మంత్రి పదవి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

  ఢిల్లీ నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశముందని సమాచారం. ఎంపీ మీనాక్షి లేఖికి కేబినెట్ బెర్త్ ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది. బీహార్‌లో ఇటీవల చిరాగ్ పాశ్వాన్‌పై తిరుగుబాటు చేసిన పశుపతి పరాస్‌కు మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీతో పాటు జేడీయూ నేతు ఆర్సీసీ సింగ్, సంతోష్ కుమార్‌కు కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు జాతీయ మీడియా కోడై కూస్తోంది. కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజీవ్ చంద్రశేఖర్, గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, అహ్మదాబాద్ వెస్ట్ ఎంపీ కిరీట్‌బాయ్ సోలంకి మోదీ టీమ్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక హర్యానా నుంచి సునీత దుగ్గల్, లద్దాఖ్ ఎంపీ జామ్యంగ్ నంగ్యాల్‌కు కూడా ఈసారి మంత్రిపదవులు ఖాయమని సమాచారం.

  కేంద్రమంత్రులు రామ్ విలాస్ పాశ్వాన్, సురేష్ అగాడి మరణించడంతో కేబినెట్‌లో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. మరికొందరు మంత్రులు రెండేసి శాఖలను నిర్వహిస్తున్నారు. అంతేగాక ఎన్డీయే నుంచి శివసేన, శిరోమణి అకాలీదళ్ వెళ్లిపోవడంతో పాటు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ బాధ్యతలను తాత్కాలికంగా వేరొకరు చూస్తున్నారు. ఇక మెరుగైన పనితీరు కనబరచని కారణంగా కొందరు మంత్రులకు ఉద్వాసన పలకవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారు ప్రధాని మోదీ. 2019లో బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. దాంతో ఎంతో మంది కొత్త వారు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీ కసరత్తులు చేశాని.. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని సమాచారం. ఐతే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరి పేరూ వినిపించకపోవడం గమనార్హం.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Cabinet Reshuffle, Central cabinet, PM Narendra Modi, Union cabinet

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు