Union Budget 2020: ఎల్లుండే కేంద్ర బడ్జెట్... రెండోసారి చిట్టాపద్దు చదవనున్న నిర్మలమ్మ

బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Union Budget 2020: దేశ పెట్టుబడుల వృద్ధి 1 శాతానికి పడిపోనుందని నిపుణులు చెబుతున్నారు. 17 ఏళ్లలో ఇదే కనిష్ట స్థాయిగా నిలువనుంది.

  • Share this:
    మరో రెండు రోజుల్లో మోదీ సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను చదవనున్నారు. అయితే ఈసారి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆమెకు కత్తిమీద సామే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులే ఇందుకు కారణం. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ అనేక ప్రతికూలతలు ఎదుర్కొంటుంది.మరోవైపు దేశ పెట్టుబడుల వృద్ధి 1 శాతానికి పడిపోనుందని నిపుణులు చెబుతున్నారు. 17 ఏళ్లలో ఇదే కనిష్ట స్థాయిగా నిలువనుంది. జీడీపీ వృద్ధి 5 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది 11 ఏళ్ల కనిష్ట స్థాయి. ప్రైవేట్ వినియోగం కూడా ఏడేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.8 శాతంగా నమోదు కావొచ్చనే అంచనాలు ఉన్నాయి.ఉత్పాదకరంగాల వృద్ధి కూడా 15 ఏళ్ల కనిష్ట స్థాయికి క్షీణించనుందని లెక్కేశారు. వ్యవసార రంగ వృద్ధి కూడా నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.8 శాతానికి క్షీణించనుంది. ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే ఇలాంటి కీలకమైన రంగాలన్నీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండట ఆర్థిక నిపుణుల్నిఆలోచనలో పడేస్తుంది.

    మరోవైపు రెండోసారి నిర్మలమ్మ బడ్జెట్‌పై అనేక మంది ఆశలు పెట్టుకుంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యాలను నిర్ధేశించడంతో పాటు, నేలచూపులు చూస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు మోదీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోనుంది? అన్నది తెలుసుకునేందుకు అందరూ బడ్జెట్ కోసం ఆతృతగా ఉన్నారు. మరికొన్నేళ్లలోనే దేశ ఆర్థిక వృవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం సాధ్యమేనని గత ఏడాది బడ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సమస్య ఏంటంటే, 2020లో ఆర్థిక వృద్ధి రేటు 5 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అది గడచిన ఆరేళ్లలో అత్యల్పం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా 2020లో భారత వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.దీంతో ఈసారైనా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ బడ్జెట్ ఉంటుందా? ప్రజలు ఆశిస్తున్నది దక్కుతుందా ? అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
    Published by:Sulthana Begum Shaik
    First published: