UNDER PRESSURE FACEBOOK BANS BJPS RAJA SINGH FOR HATE SPEECH SK
Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నిషేధం.. ఫేస్బుక్ సంచలన నిర్ణయం
రాజాసింగ్ (ఫైల్ ఫోటో)
బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేయడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఫేస్బుక్ సంస్థ.. ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
భారత్‌లో అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఫేస్బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నిషేధం విధించింది. ఇకపై ఫేస్బుక్లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎలాంటి పోస్టులు చేయకుండా బ్యాన్ చేసింది. హింసను ప్రేరేపించకూడదు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదన్న తమ పాలిసీని రాజాసింగ్ ఉల్లంఘించారని.. ఈ క్రమంలోనే ఆయనపై నిషేధం విధించినట్లు ఫేస్బుక్ అధికార ప్రతినిధి తెలిపారు. బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేయడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఫేస్బుక్ సంస్థ.. ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇటీవల ఫేస్‌బుక్‌కు సంబంధించి వాల్‌స్ట్రీట్ జనరల్ సంచలన కథనాన్ని ప్రచురించించిన విషయం తెలిసిందే. ఫేస్బుక్లో బీజేపీ నేతలు చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఆ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తూ.. చర్యలు తీసుకోవడం లేదంటూ ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ సంచలన కథనం రాసింది. భారత్‌లో తమ వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్బుక్ అలా చేస్తోందని ఆ కథనంలో పేర్కొంది. బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో మన బిజినెస్ దెబ్బతినే ప్రమాదముందని ఫేస్బుక్ ప్రతినిధి అంఖీ దాస్ ఉద్యోగులతో అన్నట్లు అందులో ఉంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు మరో ముగ్గురు బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలు చర్యలు తీసుకునే స్థాయిలో ఉన్నాయని ఫేస్బుక్ ఉద్యోగులు గుర్తించినా చర్యలు తీసుకోలేదని ఆ కథనం వెల్లడించింది. ఆ తర్వాత బీజేపీని, ఫేస్‌బుక్‌ను టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
ఫేస్బుక్ బీజేపీకి అనుకూలంగా.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. దీనిపై వివరణ కోరుతూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేత్రుత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫేస్బుక్ యాజమాన్యానికి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఫేస్బుక్ ఇండియా చీఫ్ అజిత్ మోహన్ బుధవారం కమిటీ ముందు హాజరయ్యారు. ఈ కమిటీ సమావేశం దాదాపు 2గంటల 20 నిమిషాల పాటు సాగింది. బీజేపీ, కాంగ్రెస్ వాదనలతో వాడి వేడిగా సాగిన సమావేశంలో.. ఇరు పార్టీలు ఫేస్‌బుక్‌పై పలు ప్రశ్నలు సంధించాయి. రాజాసింగ్, అమిత్ షా ప్రసంగాలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. సోనియా, కన్నయ్య కుమార్ ప్రసంగాలను తెరపైకి తెచ్చింది.
ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యల పట్ల ఫేస్బుక్ ఎన్నిసార్లు చర్యలు తీసుకుందని స్టాండింగ్ కమిటీలోని ఎంపీలు ఫేస్బుక్ ప్రతినిధులను ప్రశ్నించారు. తమ దానికి సంబంధించి ప్రత్యేక గణాంకాలేవీ లేవని వారు బదులిచ్చారు. చాలా సందర్భాల్లో ఏదైనా ఫిర్యాదు అందినప్పుడు మాత్రమే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఫేస్బుక్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందా అన్న కాంగ్రెస్ ప్రశ్నలకు సమాధానం చెప్పనట్లు తెలుస్తోంది. మరోవైపు ఫేస్బుక్ సంస్థ కాంగ్రెస్, వామపక్షాలకు అనుకూలంగా పనిచేస్తోందంటూ బీజేపీ పలు ఉదాహరణలను ప్రస్తావించింది. ఫేస్బుక్ ఫ్యాక్ట్‌చెక్ టీమ్ మెంబర్‌గా ప్రతీ సిన్హా నియామకం కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించడమేనని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. ప్రతీక్ సిన్హా గతంలో కేరళ కాంగ్రెస్‌కు కన్సల్టెంట్‌గా పనిచేశారని గుర్తు చేశారు. స్టాండింగ్ కమిటీ అడిగిన ప్రశ్నలకు ఫేస్బుక్ ప్రతినిధులు స్పష్టమైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.