‘ఆ భూములు ఎలా తీసుకుంటారు?...’ సీఎం జగన్‌కు ఉండవల్లి మరో లేఖ...

ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ జగన్

రాజమండ్రిలోని తెలుగు యూనివర్సిటీకి చెందిన 20ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలకు ఇచ్చేయాలని జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను ఉండవల్లి తప్పుబట్టారు.

 • Share this:
  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరో లేఖ రాశారు. రాజమహేంద్రవరంలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాల కోసం తీసుకోవడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. యూనివర్సిటీకి చెందిన 20ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలకు ఇచ్చేయాలని జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను ఉండవల్లి తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న తెలుగు యూనివర్సిటీని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇంకా విభజించుకోలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు. కలెక్టర్‌ ఆదేశాలను వెంటనే నిలిపేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉండవల్లి ఆ లేఖలో కోరారు.

  మూడు రోజుల క్రితం ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్‌కు ఓ లేఖ రాశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో అమరావతితో పాటు రాజమండ్రిలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరారు. కర్నూలుతో పాటు రాజమండ్రిలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక తీర్చాలని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.

  14 ఏళ్ల క్రితమే వైఎస్ఆర్ ఈ రకమైన ఆలోచన చేశారని ఉండవల్లి సీఎం జగన్‌కు వివరించారు. దీంతో పాటు మరో అంశాన్ని కూడా ఉండవల్లి తన లేఖలో ప్రస్తావించారు. రాజమండ్రిలో ఇసుక లభించడం లేదని... కొవ్వూరు నుంచి ఇసుక తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొందని వెల్లడించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఉండవల్లి సూచించారు. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: