పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడం తనకు నచ్చలేదంటూ జనసేనకు చెందిన లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో అసలు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడం సరైన నిర్ణయమేనా అనే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం సరైందే అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. పవన్ సినిమాల్లో నటించాలని మొట్టమొదట కలిసినప్పుడే చెప్పానని ఉండవల్లి తెలిపారు. వాళ్ల ప్రధాన వృత్తి అదే కాబట్టి సినిమాలు మాత్రం ఆపొద్దని సూచించానని ఉండవల్లి స్పష్టం చేశారు. పవన్ రాజకీయాలు, సినిమాలు రెండూ కుదరవని చెప్పాడని, కానీ ఇప్పుడు కుదురుతోందని అన్నారు.
గతంలో తాను సీఎం అయ్యే అవకాశాలున్నాయని భావించి పవన్ కళ్యాణ్ సినిమాలు వద్దనుకున్నాడేమో అని ఉండవల్లి అన్నారు. ఇప్పుడు నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటేనే మంచిదని నిర్ణయం తీసుకుని ఉంటాడని తెలిపారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం కరెక్టేనని, అదే సరైన నిర్ణయంగా భావిస్తున్నానని అన్నారు. జనసేన, బీజేపీల మధ్య పొత్తు గురించి ఉండవల్లి తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుత రాజకీయాల్లో పొత్తులకు ఎలాంటి విధానాలు లేవని అన్నారు. పవన్ అధికారంలో లేడు కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఫర్వాలేదని అన్నారు. పొత్తులకు సిద్ధాంతాలతో పనేముందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండొచ్చని, పవన్ కల్యాణ్ పరిస్థితిలోనూ పెద్దగా తేడాలేదని ఉండవల్లి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Janasena, Pawan kalyan, Undavalli Arun Kumar