మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 1న ముంబైలోని శివాజీ పార్క్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. ఎన్సీపీ - కాంగ్రెస్ పార్టీల మద్దతు లేఖలు తీసుకుని ఉద్ధవ్ థాక్రే, మరికొందరు సీనియర్ నేతలు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తమ వద్ద ఉందని, తమను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరతారు. ముంబైలోని ఓ హోటల్లో జరిగిన ఎన్సీపీ - కాంగ్రెస్ - శివసేన పార్టీ నేతల సమావేశంలో ‘మహా వికాస్ అఘాడి’ కూటమి నేతగా ఉద్ధవ్ థాక్రేను ఎన్నుకుంది. థాక్రే పేరును ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలా సాహెబ్ థారోట్ ప్రతిపాదించారు.
‘రాష్ట్రానికి సారధ్యం వహించే అవకాశం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. సోనియాగాంధీకి, ఇతర నేతలకు ధన్యవాదాలు. దేశానికి మనం కొత్త మార్గదర్శనం చేయబోతున్నాం. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు ముందుకెళ్దాం.’ అని ఉద్దవ్ థాక్రే అన్నారు. ఈ కూటమి ఎవరికీ తలవంచేది కాదని స్పష్టం చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:November 26, 2019, 21:46 IST