గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల ఫైట్, ప్రత్యర్థి వెనుక భారీ స్కెచ్, బయటపడిందిలా

కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం అన్నచందంగా తమ పరిస్థితి తయారైందని సదరు పోలీసు అధికారులు ఎస్పీ ఎదుట మొరపెట్టుకున్నారని తెలిసింది.

news18-telugu
Updated: October 16, 2020, 3:29 PM IST
గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల ఫైట్, ప్రత్యర్థి వెనుక భారీ స్కెచ్, బయటపడిందిలా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
(రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18)

గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంత రాజకీయాలపై ప్రజల్లో జోరుగా చర్చ కొనసాగుతుంది. గత రెండు రోజుల క్రితం గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్ని గురజాల పర్యటనలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు లోకి వచ్చాయి. సాధారణ తనిఖీలలో భాగంగా గురజాలలో పర్యటించిన ఎస్పీ అక్కడి డీఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకోవడంతో జిల్లా పోలీసు శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంత పెద్ద నేరం ఏం చేశారా అని ఆరా తీయగా సదరు అధికారులు జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు మరో ప్రజా ప్రతినిధి ఫోన్ కాల్ లిస్ట్ పై నిఘా పెట్టారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన సదరు నాయకురాలు తన ఫోన్ కాల్స్ పై నిఘాపెట్టిన వారిని కనిపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని కోరినట్టు తెలిసింది. ఫిర్యాదు చేసింది అధికార పార్టీ నాయకురాలు కావడంతో వెంటనే విచారణకు ఆదేశించడం చకచకా జరిగిపోయాయి.

ఉన్నతస్థాయి అధికారులు అత్యంత గోప్యంగా నిర్వహించిన విచారణలో గురజాల డీఎస్పీ, సీఐలు సదరు ప్రజాప్రతినిధి పీఏ, పీఎస్ ల ఫోన్ నంబరును ఓ దొంగతనం కేసులో చేర్చి కాల్ లిస్ట్ కోసం ఎస్పీ కార్యాలయానికి అభ్యర్థన పంపిన విషయం వెలుగులోకి వచ్చింది.

అప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న సదరు ప్రజా ప్రతినిధుల వ్యవహారం ఈ సంఘటనతో వారి మధ్య మరింత అగ్గిరాజేసింది. తన పీఎస్, పీఏ ల ఫోన్లపై నిఘా పెట్టిన అధికారులపై, వారిని ప్రోత్సహించిన ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని పట్టుపట్టడంతో ఎస్పీ గురజాలలో పర్యటించడం, ఆపై ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలకు ఉపక్రమించారు.

ఐతే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం అన్నచందంగా తమ పరిస్థితి తయారైందని సదరు పోలీసు అధికారులు ఎస్పీ ఎదుట మొరపెట్టుకున్నారని తెలిసింది. తమ ప్రాంతానికి చెందిన సీనియర్ ప్రజా ప్రతినిధి చెప్తే ఇలా చేశామని సదరు ఫోన్ నంబర్లు మరో ప్రజా ప్రతినిధికి సంబంధించినవి అని తమకు తెలియదంటూ ఉన్నతాధికారుల వద్ద వాపోయారని పోలీసు వర్గాల సమాచారం.

అసలే అధికార పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు తోడు ఈ కొత్త తలనొప్పులు ఎందుకు అనుకున్నారో ఏమో పార్టీ పెద్దలు రంగ ప్రవేశం చేసి విషయం సద్దుమణిగేలా ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో సదరు అధికారుల పై ముందు సస్పెన్షన్ కు రంగం సిద్ధం చేయగా ప్రభుత్వంలో ని కొందరు పెద్దల ప్రమేయంతో వారిని వీఆర్ కు పిలిచి సరిపెట్టారని పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ఇప్పటి కైనా ముఖ్యమంత్రి కల్పించుకొని ఈ ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరుకు కళ్ళెం వేయకపోతే వీరి మధ్య అధికారులు నలిగిపోవడం ఖాయమని, తాము వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్ళటం ఉత్తమం అనే ఆలోచనలో చాలామంది అధికారులు ఉన్నారు. ప్రజాప్రతినిధుల మధ్య పోరులో తాము నలిగిపోతున్నామని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు చేస్తే ఒక తప్పు, చేయకపోతే మరో తప్పులా మారుతోందని, ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని చెబుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 16, 2020, 3:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading