‘ఆ సీటు మాకే కావాలి’... సీనియర్ల పట్టు... చంద్రబాబుకు తలనొప్పి

సత్తెనపల్లి సీటును తన కుమారుడికి ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు, తన కుమారుడికే ఇవ్వాలని కోడెల శిపవ్రసాదరావు పట్టబడుతుండటంతో... చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇద్దరు సీనియర్ నేతలే కావడంతో... ఎవరికీ సర్దిచెప్పలేక ఇబ్బందిపడుతున్నారు.

news18-telugu
Updated: March 11, 2019, 8:07 PM IST
‘ఆ సీటు మాకే కావాలి’... సీనియర్ల పట్టు... చంద్రబాబుకు తలనొప్పి
చంద్రబాబు నాయుడు (File)
  • Share this:
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తమకు కావాల్సిన సీట్ల కోసం సీనియర్ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా టీడీపీలో ఇది మరికాస్త ఎక్కువైందనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరు టీడీపీ నేతల మధ్య ఒకే సీటు కోసం కొనసాగుతున్న పోటీ... చంద్రబాబుకు తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన నరసరావుపేట ఎంపీగా విజయం సాధించిన రాయపాటి సాంబశివరావు... ఈ సారి తన కుమారుడు రంగబాబును ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సత్తెనపల్లి టికెట్‌ను ఎంపిక చేసుకుని... ఆ సీటు కోసం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు... సత్తెనపల్లి టికెట్‌ను వదులుకోవడానికి సిద్ధపడటం లేదు. తనకు సత్తెనపల్లి, తన కుమారుడు శివరామకృష్ణకు నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. నరసరావుపేట ఎంపీగా పోటీ చేసేందుకు కోడెల విముఖత వ్యక్తం చేశారు.

“సత్తెనపల్లి” సస్పెన్స్
సత్తెనపల్లి సీటును తన కుమారుడికి ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు, తన కుమారుడికే ఇవ్వాలని కోడెల శివప్రసాదరావు పట్టబడుతుండటంతో... చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇద్దరు సీనియర్ నేతలే కావడంతో... ఎవరికీ సర్దిచెప్పలేక ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు ఇద్దరు నేతలు ఈ సీటు విషయంలో అస్సలు వెనక్కి తగ్గొద్దనే నిర్ణయానికి రావడంతో... బంతి చంద్రబాబు కోర్టులోనే ఉందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈ సీటు వ్యవహారంపై చంద్రబాబు కూడా ఇప్పుడప్పుడే తేల్చే అవకాశం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఇద్దరు సత్తెనపల్లి విషయంలో వెనక్కి తగ్గకపోతే... ఇద్దరి నేతల వారసులకు టికెట్ల ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకావం ఉందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఒకే సీటు కోసం టీడీపీ సీనియర్ నేతల మధ్య పోటీకి చంద్రబాబు ఏ రకంగా ముగింపు పలుకుతారో చూడాలి.First published: March 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు