మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పరాభవం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా కోలుకోలేకపోతున్నారు. ‘రాజీనామా’ నిర్ణయాన్ని విరమించుకోవాలని సొంత పార్టీ నేతలతో పాటు మిత్రపక్షాల నేతలందరూ ముక్తకంఠంతో కోరుతున్నా...అందుకు ససేమిరా అంటున్నారు రాహుల్. ఈ నేపథ్యంలో తాను 2004 నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్న అమేథీలో మొన్నటి ఎన్నికల్లో ఓటమికి కారణాల తెలుసుకునే పనిలో పడ్డారాయన. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోవడం తెలిసిందే. తన ఓటమికి కారణాలు ఏంటో నిర్థారించుకునేందుకు ఇద్దరు సభ్యుల బృందాన్ని అమేథీ పర్యటనకు పంపారు రాహుల్. కాంగ్రెస్ కార్యదర్శి జుబైర్ ఖాన్, కేఎల్ శర్మ గురువారం అమేథీ చేరుకుని..జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమేథీలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో తదుపరి రెండు, మూడు రోజులు పర్యటించనున్న వీరు...స్థానిక కాంగ్రెస్ నేతలను కలుస్తారు. రాహుల్ గాంధీ ఓటమికి దారితీసిన కారణాలపై ఆయనకు త్వరలోనే నివేదికను సమర్పిస్తారు.
రాయ్‌బరేలీలో సోనియాగాంధీ ప్రతినిధిగా ఉన్న కేఎల్ శర్మ...మొన్నటి ఎన్నికల్లో అమేథీలో కూడా రాహుల్ గాంధీ విజయం కోసం పనిచేశారు. రాహుల్ గాంధీ టీమ్ అమేథీలో పర్యటిస్తున్నట్లు ధృవీకరించిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత, అమేథీ నియోకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలను వీరు కలవనున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోవడానికి దారితీసిన కారణాలపై త్వరలోనే వారు పార్టీ నాయకత్వానికి నివేదిక సమర్పిస్తారని చెప్పారు.
అధికార దుర్వినియోగం, ధన ప్రవాహంతో పాటు పార్టీ స్థానిక నాయకత్వం బలహీనంగా ఉండడం తదితర అంశాలు రాహుల్ ఓటమికి దారితీసినట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ ప్రచార వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో బలహీనమైన స్థానిక నాయకత్వం విఫలం చెందినట్లు ఇద్దరు సభ్యుల కమిటీకి తెలియజేశారు.

అమేథీలో రాహుల్ గాంధీపై గెలిచిన స్మృతి ఇరానీ
2014 ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీ చేతిలో ఓడిపోయిన స్మృతి ఇరానీ...ఆ తర్వాత తరచూ అమేథీలో పర్యటిస్తూ స్థానిక పార్టీ నాయకత్వంతో సత్సంబంధాలను కొనసాగించారు. అమేథీకి ప్రాతినిధ్యంవహిస్తున్న రాహుల్ గాంధీ...నియోజకవర్గంలో కనిపించడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ మేరకు నియోజకవర్గంలో పోస్టర్లు కూడా వెలిశాయి. స్థానికంగా సైకిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కారణంగా తమ భూములను కోల్పోతున్న రైతులు...రాహుల్ గాంధీకి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ అంశాలతో పాటు స్థానిక ఎస్పీ-బీఎస్పీ కూటమి నేతల నుంచి రాహుల్ గాంధీకి మద్దతు లభించలేదన్న అంశాన్ని కూడా కొందరు స్థానిక నేతలు ద్విసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Smriti Irani: అమేథీకి నవోదయం: స్మృతి ఇరానీ
కేంద్ర మంత్రిగా స్మృతి ఇరానీ ప్రమాణస్వీకారం