ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్విట్టర్ పిట్ట కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మద్య మీడియాలోనే సోషల్ మీడియాలో కూడా బీభత్సమైన యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి.. టీడీపీపైనా, చంద్రబాబు, లోకేష్ లపైనా ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేస్తూనే ఉంటారు. ప్రతి రోజు ఏదో ఒక అంశంమీద చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తూనే ఉంటారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, తుఫాన్లు, పెట్టుబడులు, వ్యవసాయం, ప్రత్యేక ప్యాకేజీ, ఓటుకు నోటు కేసు, ఎన్నికలు ఇలా సందుదొరికినప్పుడల్లా చంద్రబాబుపై విమర్శలు చేసేందుకు ట్విట్టర్ పిట్టను ప్రయోగిస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి విజయసాయి తన ట్విట్టర్ ఎకౌంట్ కు పనిచెప్పారు. మరి టీడీపీ నేతలు ఊరుకుంటారా? అదే రేంజ్ లో కౌంటర్స్ పేలుస్తున్నారు.
దుబారా చేయడం లేదు..
ఇటీవల విజయసాయి రెడ్డి ఏలూరులో వింత వ్యాధిపై చంద్రబాబును టార్గెట్ చేశారు. ఏ విషయాన్నైనా ముందుగానే కనిపెట్టే చంద్రబాబుకు ఈసారి రాడార్ ఏలూరు విషయం చెప్పలేదా అంటూ ఎద్దేవా చేశారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి చెందడంతో తిరుపతిలో ఏం పొడుస్తారో అంటూ దెప్పిపొడిచారు. తాజాగా రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో చంద్రబాబు వైఖరిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘వందలకోట్ల దుబారాతో పార్టనర్ షిప్ సమ్మిట్లు, దావోస్ లో రోడ్ షోలు లేవు.. వైఎస్ జగన్ విశ్వసనీయతే ప్రామాణికంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని.. ఉపాధి కోసం యువత బయటకు వెళ్లే పరిస్థితి లేదు’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి
జ్వరం వస్తే పక్కరాష్ట్రానికి...
దీనికి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. యువత సంగతి తరువాత, మీకు జ్వరం వస్తేనే పక్క రాష్ట్రానికి పారిపోయిన సంగతి మర్చిపోయారా అన్నారు. 18 నుంచి 35ళ్ళ వయసు గల యువతలో ఫైర్ ఉంటుంది. దాన్ని ఎలా ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఎలా వాడుకోవాలో తెలియకుండా, వాలంటీర్ ఉద్యోగాలు, తోపుడు బళ్ళు,జగనన్న సారాయి దుకాణాల్లో ఉద్యోగులుగా పెట్టి, యువతను నిర్వీర్యం చేసేస్తున్నారని మండిపడ్డారు. ఈ 18 నెలల్లో వెళ్ళిపోయిన కంపెనీల లిస్టు, 200 దాటింది,వచ్చిన కంపెనీ ఒక్కటి లేదన్నారు.

చింతకాయల అయ్యన్నపాత్రుడు ట్విట్టర్
పోల‘గరం’
పోలవరంపైనా చంద్రబాబును విజయసాయి రెడ్డి టార్గెట్ చేశారు. ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుమతులు తీసుకొస్తే.. వైఎస్ జగన్ పూర్తి చేస్తున్నారని..మరి మధ్యలో ఉన్నవాళ్లు ఏం చేశారో అని ప్రశ్నించారు.

విజయసాయి రెడ్డి ట్విట్టర్
దీనికి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటర్ వేశారు. పోలవరంలో చంద్రబాబు కట్టిన గ్రాఫిక్స్ చూడటానికి వెళ్తున్న సీఎం జగన్ కు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. పోలవరం గ్రాఫిక్స్ అన్నారు ఇప్పుడు ఏకంగా పర్యటనలు ఏంటో అని ప్రశ్నించారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్
ఇక జనసేన పార్టీ కూడా డైరెక్ట్ గా రంగంలోకి దిగకుండా ట్విట్టర్ ద్వారానే కౌంటర్లు వేస్తుంటుంది. ఆ పార్టీ అధినేత ట్విట్టర్ ద్వారానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. అంతేకాదు ఆయన చేసిన ట్విట్లు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. పొద్దున్నే లేస్టే ట్విట్టర్ జపం చేస్తున్న పొలిటికల్ లీడర్స్.. డైరెక్ట్ గా రంగంలోకి దిగితే మరిన్ని మంచి ఫలితాలొస్తాయని జనం అంటున్నారు.