news18-telugu
Updated: October 8, 2018, 5:18 PM IST
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల సమావేశం (File)
తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే, కారు జోరుకు బ్రేకులు వేస్తామంటున్న మహాకూటమి మాత్రం ఇంకా సీట్ల లెక్కలను తేల్చలేదు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చించిన కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఐ, జనసమితి నేతలు ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక మీదే దృష్టిపెట్టారు. సీట్ల షేరింగ్ మీద ఇంకా చర్చించలేదంటూ దాటవేస్తున్నారు. అయితే, తాజాగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత భక్తచరణ్ దాస్ నేతృత్వంలోని అభ్యర్థుల ఎంపిక కమిటీ ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈ కమిటీ భాగ్యనగరంలోనే ఉండి ఎన్నికల మీద కసరత్తు చేస్తుంది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై చర్చించనుంది. ఈనెల 20వ తేదీలోపే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏయే నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మిగిలిన మిత్రపక్షాల నుంచి పోటీ లేరో.. అక్కడ కేండెట్లను మొదటగా ప్రకటించనుంది. కాంగ్రెస్‌తోపాటు మిత్రపక్షాలు కూడా బలంగా ఉన్న నియోజకవర్గాలపై జరిపిన సర్వేల ఆధారంగా లిస్ట్ తయారు చేయనుంది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇద్దరి పేర్లు ఫైనల్ చేసి.. వాటిని కాంగ్రెస్ ముఖ్యనేత అహ్మద్ పటేల్‌కు పంపనుంది.
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం... తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సింహభాగం కాంగ్రెస్ పోటీ చేయనుంది. తెలంగాణ టీడీపీకి 12 సీట్లు, తెలంగాణ జనసమితికి మూడు సీట్లు, సీపీఐకి నాలుగు సీట్లు కలిపి మొత్తం 20 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని భావిస్తోంది. అప్పటి పరిస్థితిని బట్టి మిత్రపక్షాల డిమాండ్‌ను బట్టి కొంచెం పట్టువిడుపు ధోరణి అవలంభించే అవకాశం ఉంది.
సీట్ల సంఖ్య మీద కాంగ్రెస్, టీడీపీ మధ్య ఓ అవగాహన కుదిరినట్టు సమాచారం. అయితే, ఏయే నియోజకవర్గాల్లో సీట్లు కేటాయించాలన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు రాబోయే ఎన్నికల్లో పోటీకి కోదండరాం దూరంగా ఉండనున్నారనే ప్రచారం జరుగుతోంది. టీజేఎస్ నుంచి రచనరెడ్డి, దిలీప్ కుమార్, గాదె ఇన్నయ్య పోటీ చేస్తారని సమాచారం. అలాగే టీటీడీపీ అధ్యక్షుడు రమణ కూడా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎల్.రమణ అడుగుతున్నట్టు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
సీట్ల సర్దుబాటు చర్చల సందర్భంగానే ఉప ముఖ్యమంత్రి డిమాండ్‌కు కూడా ఒప్పించాలని టీటీడీపీ భావిస్తోంది. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది కాబట్టి.. తమ సంఖ్యను తగ్గించుకుంటున్నాం కాబట్టి.. అందుకు ప్రతిఫలంగా ఒకవేళ మహాకూటమి గెలిస్తే ఉపముఖ్యమంత్రి పదవి తీసుకోవాలనేది తెలంగాణ తమ్ముళ్ల ప్లాన్. ఇప్పుడే ఓ క్లారిటీకి వస్తే.. తర్వాత ఇబ్బంది ఉండదనే కోణంలో ఆలోచిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 8, 2018, 5:15 PM IST