తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంబంధించిన కేసు విచారణను హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేయడంతో టీఆర్ఎస్ సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతోంది.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంబంధించిన కేసు విచారణను హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేయడంతో టీఆర్ఎస్ సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. ఆదివారానికి దసరా సెలవులు పూర్తయ్యి, సోమవారం పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు బస్సు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ఇప్పట్లో ఆ సమస్య తీరే అవకాశం లేనందున సెలవులను మరో మరో రెండు, మూడు రోజులపాటు పొడిగించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన వాహనాలను ఆర్టీసీ బస్సులో స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. అందువల్ల విద్యార్థులకు సెలవులు పొడిగిస్తే సమస్య ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అదీకాక, నగరంలో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించడం వల్ల విద్యార్థులకు రాకపోకలకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలున్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తేనే బెటర్ అని కేసీఆర్ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, కార్మికులను తొలగిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో పాటు, కొత్త వారిని నియమిస్తామని వెల్లడించారు. తాజాగా, కోర్టు విచారణను వాయిదా వేయడంతో, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధప్రాతిపాదికన కొత్త వారిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన విధివిధానాలతో కొత్త వారిని విధుల్లోకి తీసుకొనే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.