కేసీఆర్ చేతిలో ‘ఆర్టీసీ స్టీరింగ్’.. రేపటి నిర్ణయంతో కొలిక్కి...

సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల కమిటీకి ప్రభుత్వం అంగీకరిస్తే తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు ఓ రకంగా ఫుల్ స్టాప్ పడినట్టే.

news18-telugu
Updated: November 12, 2019, 6:43 PM IST
కేసీఆర్ చేతిలో ‘ఆర్టీసీ స్టీరింగ్’.. రేపటి నిర్ణయంతో కొలిక్కి...
ఆర్టీసీ, సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కోర్టులో ఉంది. కేసీఆర్ తీసుకోబోయే ఒక్క నిర్ణయం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించేందుకు దోహదం చేయనుంది. అయితే, కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి హైకోర్టులో విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వాన్ని కానీ, ఇటు కార్మికులను కానీ ఫలానాది కచ్చితంగా చేయాల్సిందే అంటూ తాము ఆదేశించలేమని కోర్టు అభిప్రాయపడింది. అయితే, మధ్యేమార్గంగా ఓ ప్రతిపాదన చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కూడిన కమిటీని వేయాలని తాము భావిస్తున్నామని, దీనిపై ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. దీంతో బాల్ కేసీఆర్ కోర్టులోకి వచ్చింది.

సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల కమిటీకి ప్రభుత్వం అంగీకరిస్తే ఆర్టీసీ సమస్య ఓ రకంగా కొలిక్కి వచ్చినట్టే. ఆర్టీసీని ఏం చేయాలి?, ఏం చేయకూడదనే అంశాలను కమిటీ పరిశీలించి రిపోర్టు ఇస్తుంది కాబట్టి.. అప్పటి వరకు విధుల్లో చేరాలని హైకోర్టు కార్మికులకు సూచిస్తుంది. ఇప్పటికే సుమారు రెండు నెలలుగా జీతాలు లేని కార్మికులు అందుకు అంగీకరించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అదే సమయంలో కేసీఆర్ తలొగ్గారనే అభిప్రాయం కూడా రాదు. కార్మికులు వెనుకడుగు వేశారనే ప్రశ్న కూడా ఉత్పన్నం కాదు. ఉభయతారకంగా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

అయితే, అసలు కేసీఆర్ ఉద్దేశం ఏంటనేదే ఇప్పుడు ప్రశ్న. హైకోర్టు చెప్పిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల కమిటీకి ఓకే చెబితే.. తన చేతిలో ఉండే సర్వహక్కులను కోల్పోవాల్సి వస్తుందా? అనే సందేహం కూడా వస్తుంది. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ అభిప్రాయాలు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల కమిటీ అభిప్రాయాలు ఒకేలా ఉండాలన్న నిబంధన లేదు. అదే సమయంలో ఎప్పుడైనా ఇలాంటి కమిటీలు కేవలం సూచనలు మాత్రమే చేస్తాయి కానీ, వాటి అమలు అనేది ప్రభుత్వానికే వదిలేస్తాయి. కాబట్టి, ‘ఆర్టీసీ స్టీరింగ్’ తన చేతిలో నుంచి జారిపోయిందన్న ఆలోచనకు తావుండదు. వీటన్నిటిపై ఓసారి అధికారులు, న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
First published: November 12, 2019, 6:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading